ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెస్తే రూ. 10 కోట్లు ఇస్తానని అయోధ్య సాధువు పరమహంస ఆచార్య అవార్డు ప్రకటించారు. ఎవరూ ఆ పని చేయకుంటే తానే స్వయంగా ఉదయనిధి స్టాలిన్ తల నరికేస్తానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 

న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అగ్గి మీద గుగ్గిళం అయిన సంగతి తెలిసిందే. కొన్ని హిందూ మత సంఘాలు కూడా వ్యతిరేకించాయి. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకూ సమర్థింపులు లభించాయి. ఈ సందర్భంలో అయోధ్య సాధువు పరమహంస ఆచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసిన ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెచ్చిన వారికి రూ. 10 కోట్ల రివార్డ్ ఇస్తానని ప్రకటించారు. ఎవరూ ఆ పని చేయకుంటే తానే స్వయంగా ఉదయనిధి స్టాలిన్ తల నరికేస్తానని చెప్పారు.

సనాతన ధర్మం కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వం నుంచి ఉన్నదని ఆయన అన్నారు. కొన్ని మతాలు రెండు వేల సంవత్సరాలకు పూర్వం నుంచే మొదలయ్యాయని తెలిపారు. ఈ భూమి పై ఒకే మతం ఉన్నదని, అది సనాతన ధర్మం అని వివరించారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నాశనం చేయలేరని, ఎవరైనా నాశనం చేయాలని ప్రయత్నిస్తే వారే నాశనమైపోతారని అన్నారు.

Scroll to load tweet…

సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చుతూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని రేపాయి. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు.. నిర్మూలించాలని పిలుపు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్, డీఎంకేలను తీవ్రంగా విమర్శించింది. ప్రతిపక్ష ఇండియా కూటమి మొత్తం కూడా హిందు వ్యతిరేకి అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

Also Read: లోపాలను కప్పిపుచ్చుకోవడానికి మతాన్ని అస్త్రంగా చేసుకున్న బీజేపీ: ఎంకే స్టాలిన్

ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్‌ను అడగ్గా.. ఆయన తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగానే చెప్పారు. తాను కేవలం సనాతన ధర్మాన్ని విమర్శించానని చెప్పారు. దాని నిర్మూలన చేయాలని మాత్రమే పిలుపు ఇచ్చానని వివరించారు. 

‘ఇదే విషయాన్ని నేను మళ్లీ మళ్లీ అంటాను. కొందరు చిన్నపిల్లల్లా వ్యవహరిస్తూ నేను మొత్తం ఊచకోతకే పిలుపు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకొందరు ద్రావిడాన్ని నిర్మూలించాలని పిలుపు ఇస్తున్నారు. అంటే.. డీఎంకే మనుషులను చంపేయాలనా? అదే మరీ, ప్రధాని మోడీ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అంటే ఏమిటీ? కాంగ్రెస్ మనుషులను అందరినీ చంపేయాలనేనా? సనాతన అంటే ఏమిటీ? దాని అర్థం యథాతథం, అన్ని శాశ్వతం అని చెప్పడమే’ అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.