Asianet News TeluguAsianet News Telugu

Ayodhya Ram Mandir : అయోధ్యలో ముగిసిన కీలక ఘట్టం.. గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట

అయోధ్య రామ మందిర ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి గురువారం కీలక ఘట్టం పూర్తయ్యింది. అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఐదేళ్ల బాల రాముడి 51 అంగుళాల పొడవైన నల్లరాతి విగ్రహాన్ని నాలుగు గంటల పూజలు, వేద మంత్రాల నడుమ ప్రతిష్టించారు.

Ayodhya Ram Mandir: Ram Lalla's idol placed inside ksp
Author
First Published Jan 18, 2024, 6:22 PM IST

అయోధ్య రామ మందిర ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి గురువారం కీలక ఘట్టం పూర్తయ్యింది. అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఐదేళ్ల బాల రాముడి 51 అంగుళాల పొడవైన నల్లరాతి విగ్రహాన్ని నాలుగు గంటల పూజలు, వేద మంత్రాల నడుమ ప్రతిష్టించారు. రామజన్మభూమి తీర్ధ క్షేత్ర ధర్మకర్త బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా పర్యవేక్షణలో ఈ విగ్రహాన్ని ఎంపిక చేశారు. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో 121 మంది పూజారులు పాల్గొన్నట్లు పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని గర్భగుడిలో వాస్తు పూజ కూడా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 

 

 

మరోవైపు.. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ముందు 11 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ 'అనుస్థాన్' (ప్రత్యేక ఆచారం) పాఠిస్తున్నారు. అందులో భాగంగా ఆయన కఠిన నియమాలను పాటిస్తున్నారు. నేలపైనే  నిద్రపోతున్నారు. కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని ‘ఇండియా టుడే’ కథనం పేర్కొంది. జనవరి 12వ తేదీన ఈ అనుస్థాన్ పాఠిస్తున్నట్టు ప్రధాన నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన చారిత్రాత్మక, శుభకార్యాన్ని వీక్షించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించడానికి దేవుడు తనను ఒక సాధనంగా ఎంచుకున్నాడని చెప్పారు. ఈ నేపథ్యంలో 11 రోజుల ప్రత్యేక మతపరమైన వ్యాయామాన్ని చేపడుతున్నానని ప్రధాన మంత్రి చెప్పారు.

11 రోజుల పాటు 'యమ్ నియామ్'కు కట్టుబడి ఉంటారని, గ్రంథాలలో పేర్కొన్న అన్ని సూచనలను ఖచ్చితంగా పాటించాలని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ నియమంలో భాగంగా యోగా, ధ్యానం, వివిధ అంశాల్లో క్రమశిక్షణతో సహా అనేక కఠినమైన చర్యలను పాఠించాల్సి ఉంటుంది. సూర్యోదయానికి ముందు శుభ సమయంలో మేల్కొనడం, ధ్యానం, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం వంటి అనేక క్రమశిక్షణలను ప్రధాని మోడీ తన దైనందిన జీవితంలో ఇప్పటికే అనుసరిస్తున్నారని అధికారులు తెలిపారు.

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, సాధువులు సహా 7,000 మందికి పైగా ఈ వేడుకకు హాజరవుతారని ఆలయ ట్రస్ట్ తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios