తమిళనాడులో హారన్ కొట్టాడని బర్త్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్న యువకులు తీవ్రంగా దాడి చేసి చంపేశారు. దారి ఇవ్వబోమని, కేక్ కట్ చేసే దాకా ఆగాలని యువకులు ఆదేశించారు. లేదు.. తనకు దారి ఇవ్వాలని పట్టుబట్టడంతో కొట్టి చంపేశారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. 

న్యూఢిల్లీ: తమిళనాడులో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి పూట నడి రోడ్డుపై కొంత మంది యువకులు ఓ బర్త్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ, అదే రోడ్డుపై అటు వైపుగా ఓ ఆటో వచ్చింది. హారన్ కొట్టి తనకు దారి ఇవ్వాలని డ్రైవర్ కోరాడు. కానీ, ఆ యువకులు రోడ్డుపైనే చిందులు వేయడం కాకుండా.. కేక్ కట్ చేసేదాకా ఆగలేవా? అంటూ రివర్స్ అయ్యారు. మళ్లీ సహనంతో దారి ఇవ్వాలని ఆ ఆటో డ్రైవర్ హారన్ కొట్టడంతో యువకులు ఆగ్రహానికి గురై డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. బర్త్ డే బాయ్ కేక్ కట్ చేసే కత్తితో ఆ డ్రైవర్‌ను పొడిచేశాడు. హాస్పిటల్ తీసుకెళ్లేలోపే ఆటో డ్రైవర్ మరణించాడు. ఈ ఘటన చెన్నైలోని అంబత్తూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

అంబత్తూర్‌లో 25 ఏళ్ల కామేశ్ ఆటో డ్రైవర్‌గా చేస్తున్నాడు. గురువారం రాత్రి తన అన్నయ్య 29 ఏళ్ల సతీష్‌ను ఒరగడమ్‌లోని ఇంటి వద్ద దించి వెళ్లాలని కామేశ్ అనుకున్నారు. అంబత్తూర్ అన్నయ్యను ఎక్కించుకుని రాత్రి 11.30 గంటలకు వెళ్లుతుండగా ఓ చోట దారి మధ్య కొందరు యువకులు హంగామా చేస్తున్నారు. కేక్ కట్ చేయడానికి రోడ్డుపైనే ఏర్పాట్లు చేశారు. దీంతో తనకు దారి ఇస్తే వెళ్లిపోతానని, వారి వేడుక యథావిధిగా నిర్వహించుకున్నా తనకేమీ అభ్యంతరం లేదని కామేశ్ అన్నాడు. కానీ, ఆ యువకులు అందుకు ఒప్పుకోలేదు.

Also Read: ఎక్కువ ముస్తాబైందని, సెంట్ కొట్టుకుందని భార్యను షూట్ చేసిన అనుమానపు భర్త

తాము దారిచ్చేదే లేదని కామేశ్‌కు ఆ యువకులు తేల్చి చెప్పారు. కేక్ కట్ చేసే ఆగి.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. కానీ, అన్నయ్య వారి ఇంటి వద్ద దింపి వెళ్లాల్సి ఉన్న కామేశ్ తనకు దారి ఇవ్వాల్సిందేనని హారన్ కొడుతూనే ఉన్నాడు. హారన్ సౌండ్‌తో యువకులు తీవ్రంగా కోప్పడ్డారు. ఆటో వద్దకు వెళ్లి కామేశ్‌ను బయటకు లాగి కొట్టారు. కత్తితోనూ దాడి చేశారు. అడ్డుకోబోయిన సతీష్ పైనా దాడి చేశారు. అనంతరం, స్పాట్‌ నుంచి పారిపోయారు.

సతీష్ తన సోదరుడు కామేశ్‌ను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాడు. కానీ, కత్తిపోట్లతో కామేశ్ అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పారు.

పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన బర్త్ డే బాయ్ గౌతమ్, నవీన్ కుమార్, అజయ్, రియాజ్, కతీర్ సేన్, సూర్యలను అరెస్టు చేశారు. వీరంతా 23 నుంచి 18 ఏళ్ల వారే కావడం గమనార్హం. మరో ఇద్దరు మైనర్లను అరెస్టు చేయాల్సి ఉన్నది.