ఎక్కువ ముస్తాబైందని, సెంట్ కొట్టుకుందని భార్యను షూట్ చేసిన అనుమానపు భర్త
మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో కాల్చేశాడు. ఇంటి నుంచి బయటక వెళ్లుతున్న ఆమె ముస్తాబవుతుండగా.. పెర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉండగా భర్త ఆమె దగ్గరకు వచ్చి అనుమానంగా ప్రశ్నలు వేశాడు. ఇది పరస్పరం వాదనలకు దారి తీసింది. అనంతరం, భర్త గన్ తీసి భార్య ఛాతిలో బుల్లెట్ దించాడు.

భోపాల్: ఓ మహిళ ఇంటి నుంచి బయటికి వెళ్లుతూ ముస్తాబైంది. చివరగా సెంట్ కూడా కొట్టుకుంది. ఇదంతా గమనించిన భర్త ఆమె ముందుకు వచ్చాడు. ఎక్కడికి వెళ్లుతున్నావ్? ఇంత ముస్తాబు ఎందుకు? అని అనుమానంతో ప్రశ్నించాడు. ఈ అనుమానపు ప్రశ్నతో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. చివరకు ఆగ్రహం తట్టుకోలేక భర్త తన వద్ద నుంచి గన్ తీసుకుని భార్య ఛాతీలో బుల్లెట్ దించాడు. అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది.
బిజోయిలి థానా ఏరియాలోని గణేష్‌పురాకు చెందిన నీలం జాతవ్‌కు సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం మహేంద్ర జాతవ్‌తో పెళ్లయింది. కానీ, మహేంద్ర జాతవ్ పై కొన్ని కేసులు ఉన్నాయి. ముఖ్యంగా దొంగతనం కేసుల్లో ఆయనకు నేర చరిత్ర ఉన్నది. పెళ్లి చేసుకున్న తర్వాత మహేంద్ర జాతవ్ అలాంటి ఓ కేసులో జైలుకు వెళ్లాడు. దీంతో నీలం జాతవ్ తన తల్లి ఇంటి వద్ద ఉంటున్నది.
సుమారు నాలుగేళ్లు జైలు జీవితం గడిపిన మహేంద్ర జాతవ్ ఏడాది కింద విడుదలయ్యాడు. నేరుగా తన భార్య వద్దకు వెళ్లాడు. నీలం జాతవ్ తల్లి ఇంటి వద్దే ఉంటున్నది. మహేంద్ర జాతవ్ కూడా ఆమెతో.. వారి తల్లిగారింటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నీలం జాతవ్ పై మహేంద్ర జాతవ్‌కు ఎందుకో అనుమానాలు రేగాయి.
Also Read: మిజోరం రాష్ట్రానికి మణిపూర్ సెగలు.. ‘మైతేయిలు వెళ్లిపోవాలి’.. భద్రత కల్పించిన ప్రభుత్వం
శనివారం నీలం జాతవ్ ఇంటి నుంచి ఏదో పని మీద బయటకు వెళ్లడానికి రెడీ అవుతున్నది. అప్పుడు మహేంద్ర జాతవ్ ఆమె వద్దకు వచ్చాడు. ఎందుకు ఓ తెగ రెడీ అయిపోతున్నావ్? అంతలా డ్రెస్సింగ్ ఎందుకు? ఆ పెర్ఫ్యూమ్ అవసరమా? అంటూ భార్యను అడిగాడు. ఈ ప్రశ్నలు ఆ దంపతుల మధ్య వాగ్వాదానికి దారి తీశాయి. ఈ వాదనలు ముదిరిన తర్వాత మహేంద్ర జాతవ్ ఆగ్రహానికి గురై తన వద్ద ఉన్న తుపాకీని బయటకు తీశాడు. ఎదురుగా ఉన్న నీలం జాతవ్ ఛాతీలోకి గురి పెట్టి గన్ పేల్చాడు. నీలం జాతవ్ బిగ్గరగా అరుస్తూ నేలపై పడిపోయింది.
అయితే సకాలంలో నీలం జాతవ్ సోదరుడు దినేశ్ జాతవ్ రియాక్ట్ అయ్యాడు. తన సంబంధీకులకు ఫోన్ చేసి వెంటనే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లాడు. పోలీసులు మహేంద్ర జాతవ్ పై కేసు పెట్టారు. హత్యా ప్రయత్నం కింద కేసు ఫైల్ అయింది. మహేంద్ర జాతవ్ కోసం గాలింపులు మొదలయ్యాయి.