తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆడియో క్లిప్ దుమారం రేపింది. సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిది స్టాలిన్, అల్లుడు సబరీసన్ ఆస్తులను తమిళనాడు మంత్రి పీటీఆర్ పేర్కొన్నట్టుగా ఉండే క్లిప్ చర్చనీయాంశమైంది. తాజాగా, ఆ ఆడియో క్లిప్పే అవాస్తవమని, ఎవరైనా అలాంటి నకిలీ ఆడియో క్లిప్‌ను ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ సహాయంతో రూపొందించవచ్చని వివరించింది. 

న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుటుంబం ఆస్తులపై తాను కామెంట్ చేశానంటూ బీజేపీ చెబుతున్న ఆడియో క్లిప్‌లపై ఆర్థిక మంత్రి పెలనివేల్ తియగ రాజన్ (పీటీఆర్) స్పందించారు. ఆ ఆడియో క్లిప్‌లు నకిలీవని పేర్కొన్నారు.

డీఎంకే ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి, ఆయన అల్లుడు సబరీసన్ ఆస్తుల గురించి మంత్రి పీటీఆర్ కొన్ని రహస్య విషయాలను వెల్లడించాడని తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నమలై ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను కూడా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపింది. రిజైన్ స్టాలిన్ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది.

దీనిపై శనివారం మంత్రి పీటీఆర్ స్పందించారు. రెండు పేజీల లేఖను ట్వీట్ చేశారు. ఆ ఆడియో క్లిప్ నకిలీదని, కుట్రపూరితంగా టెక్నాలజీ సహాయంతో తయారు చేశారని పేర్కొన్నారు. ఆ క్లిప్‌నకు సంబంధించిన ఫోరెన్సిక్ అనాలిసిస్ స్క్రీన్ షాట్లనూ ఆయన ట్వీట్ చేశారు.

తాను భావ ప్రకటన స్వేచ్ఛకు విలువనిచ్చే వాడినని, అనేక ఆరోపణలకు తాను స్పందించలేదనీ అన్నారు. కానీ, ఈ సారి తాను స్పందించ తప్పలేదని తెలిపారు. తాను స్పందించేలా బలవంతపెట్టే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే టెక్నికల్ అనాలిసిస్ తో కూడా ఈ ఆడియో క్లిప్ నకిలీదని చెప్పవచ్చని తెలిపారు. ఇది ఆథెంటిక్ ఆడియో క్లిప్ కాదని తేలిపోతుందని వివరించారు.

Also Read: అమ్మవారి మీద ఒట్టు.. కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా నాశనమైపోతా : రేవంత్ రెడ్డి

కాగా, ఈ ట్వీట్‌కు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై స్పందించారు. ఆ ఆడియో క్లిప్ శాంపిల్ అనాలిసిస్ డీఎంకేనే చేసిందని వివరించారు. అంతేకానీ, ఏ స్వతంత్ర ఏజెన్సీతోనీ దీన్ని చెక్ చేయించలేదని పేర్కొన్నారు. ఒక స్వతంత్ర ఏజెన్సీకి ఆ ఆడియో క్లిప్ ఇచ్చి పరీక్షించే ధైర్యం డీఎంకే మంత్రికి ఉన్నదా అని సవాల్ చేశారు. 

మంత్రి ఆడియో అని చెబుతూ బీజేపీ చేసిన ఆడియో క్లిప్ రాజకీయ వర్గాలను కుదిపేశాయి.