అమ్మవారి మీద ఒట్టు.. కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా నాశనమైపోతా : రేవంత్ రెడ్డి

తనపై బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేశారు

tpcc chief revanth reddy Swears in bhagyalakshmi temple ksp

తనపై బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేశారు. తాను కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా సర్వనాశనమైపోతానని రేవంత్ స్పష్టం చేశారు. ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధమైతే ఏం జరుగుతుందో నీకే తెలుసునంటూ ఈటలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. 

కాగా.. రేవంత్‌పై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలుగునాట కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదని .. కాంగ్రెస్‌ పార్టీపై కేసీఆర్ ఈగ వాలనివ్వరని ఈటల ఆరోపించారు.  ఈ నేపథ్యంలో దీనిపై రేవంత్ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నుంచి కానీ, కేసీఆర్ నుంచి కానీ తాను రూపాయి కూడా తీసుకోలేదన్నారు. దీనిపై చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు తడిబట్టలతో ప్రమాణం చేద్దామా అంటూ రేవంత్ సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు ఈటల నిరూపించాలన్నారు. తమ పార్టీ కార్యకర్తల శ్రమను, వారి మద్దతును ఈటల రాజేందర్ అవమానించారని మండిపడ్డారు. రాజేందర్ వ్యాఖ్యలు రాజకీయ చర్చల ప్రమాణాలను దిగజార్చుతున్నాయని విమర్శించారు. 

అంతకుముందు రేవంత్ రెడ్డిపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యల్లో 100 శాతం నిజం ఉందని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలకు డబ్బులందిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ ఆర్థికంగా సాయపడిందని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్  నేతలు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. గుమ్మడికాయల దొంగంటే రేవంత్‌ భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. 

రేవంత్ వాస్తవాలు  జీర్ణించుకోలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి అనలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లోపాయికారీ ఒప్పందం ఉప ఎన్నికల్లో తేలిపోయిందని అన్నారు. ఓటుకు నోటుపై భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios