Asianet News TeluguAsianet News Telugu

Asianet News Mood of the Nation Survey: లోక్‌సభ 2024 ఎన్నికల్లో మోదీ ప్రభంజనం, కాంగ్రెస్‌కి తప్పని పరాభవం 

ఏషియా నెట్ న్యూస్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఈ లోక్ సభ ఎన్నికల్లో బిజెపి గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లు తేల్చింది.  కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తప్పదని ఈ సర్వే ఫలితాలు సూచించాయి.  

Asianet News Mood of the Nation Survey Result 2024
Author
First Published Mar 27, 2024, 6:00 PM IST
  • ఏషియానెట్ న్యూస్ నెట్ వర్క్ సర్వేలో 79 శాతం భారతీయులు మరోసారి ఎన్డిఏ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. INDI కూటమిని తీవ్రంగా తిరస్కరించారు. 
  • భారత ప్రధాని అయ్యే అవకాశం మరోసారి నరేంద్ర మోదీకే ఉందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చింది.   
  • మోదీ హయాంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో చాలా అభివృద్ధి చెందిందని 80 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 
  • రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మార్చలేదని 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. 


త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలు అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)కే కాదు ప్రతిపక్షాలకు కూడా అగ్నిపరీక్ష. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఈ ఎన్నికలు పెద్ద సవాల్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) కి   వ్యతిరేకంగా ఇండియా కూటమి పోటీ చేస్తోంది. ఇలా ఎన్నికల హడావిడి సాగుతున్న వేళ  ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఈ మెగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రతిపక్ష కూటమి తీవ్రమైన పోటీని ఎదుర్కోనుందని తేలింది. ఈ సార్వత్రిక ఎన్నికలు దేశాన్ని మరింత వృద్దిపథంలో నడిపించగలవని ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చింది. 

ఏషియా నెట్ న్యూస్ నెట్ వర్క్స్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ (తెలుగు, ఇంగ్లీష్, హింది, మలయాళం, కన్నడ, తమిళ్, బంగ్లా, మరాఠీ) మార్చి 13 నుండి 27 వరకు  లోక్ సభ ఎన్నికలపై సర్వే నిర్వహించాయి. ఈ ఆన్ లైన్ సర్వేలో 7.6 లక్షల మంది పాల్గొన్నారు.  మా ఎడిటర్స్ దేశంలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయాలకు సంబంధించి ప్రజలు చర్చించుకుంటున్న అంశాలపై సర్వే ప్రశ్నలను రూపొందించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ ప్రశ్నలు వున్నాయి. ప్రతి ఓటును పరిగణలోని తీసుకుని... ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువనిస్తూ ఈ మూడ్ ఆఫ్ ది  నేషన్ సర్వే సాగింది. 

ఏషియా నెట్ న్యూస్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వివరాలు : 

ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఈ ఎన్నికల్లో బిజెపిపై సానుకూల ప్రభావం చూపించనుందని 51.1 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో సిఎఎ అమలు ఈ ఎన్నికల్లో బిజెపిపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని కేవలం 26.85 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు.  ఇక మరో 22.03 శాతం మంది సిఎఎ అనేది ఏ పార్టీపై ప్రభావం చూపించదన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సర్వేలో పాల్గొన్న 48.4 తమిళనాడు ప్రజలు సిఎఎ అమలు అనేది లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి కలిసిరాదని అభిప్రాయపడ్డారు. 

నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాలేమిటని ప్రశ్నించగా అత్యధిక శాతం మంది మౌలిక సదుపాయాల కల్పన అని తెలిపారు.  38.11 శాతం మంది దీనికి ఓటేసారు.  ఇక మరో 26.11 శాతం మంది డిజిటల్ ఇండియా,  11.46 శాతం మంది ఆత్మనిర్భర్ భారత్ కు ఓటేసారు. ఇక అయోధ్య  రామమందిర నిర్మాణం మోదీ సర్కార్ సాధించిన అతిపెద్ద విజయమని హిందీ మాట్లాడే ప్రాంతాల్లో 30.04 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో పాల్గొన్న తెలుగు ప్రజల్లో 30.83 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.   డిజిటల్ ఇండియా కూడా మంచి విజయమని అభిప్రాయపడ్డారు. 

రాబోయే లోక్ సభ ఎన్నికలపై అయోధ్య రామమందిర ప్రభావం వుంటుందని  దేశవ్యాప్తంగా 57.16 శాతం మంది పేర్కొన్నారు.   మరో  31.16 శాతం మంది మరోలా తమ అభిప్రాయాన్ని తెలియజేసారు.   

Asianet News Mood of the Nation Survey Result 2024

ఇక ప్రధాని ఎవరయితే బావుంటుందని అడగ్గా మళ్లీ నరేంద్ర మోదీనే కోరుకుంటున్నట్లు 51.06 శాతం మంది అభిప్రాయపడడ్డారు.  అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కావాలని 46.45 శాతం మంది కోరుకున్నారు.  కేరళలో మాత్రం రాహుల్ ను 50.59 శాతం మంది ప్రధానిగా కోరుకున్నారు. ఇక నరేంద్ర మోదీ నిజమైన నాయకుడిగా 80శాతం మంది అభిప్రాయపడ్డారు.  దక్షిణాదిన కొన్నిరాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలనే ఎక్కువమంది కోరుకుంటున్నట్లు మూడ్ ఆఫ్ ది నేషన్  సర్వేలో తేలింది. 

మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. దశాబ్దాలుగా ఉచితాలు, వాగ్దానాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఓటర్లు ఈసారి మాత్రం అభివృద్దికే ఓటేసారు. 80.5 శాతం మంది అభివృద్దే తమకు ముఖ్యమని... కుల సమీకరణలు, అభ్యర్థి,  ఉచితాలు కాదని తేల్చారు.  ఇవే తమ ఓటును నిర్ణయిస్తాయని తేల్చారు. యువ ఓటర్ల మూడ్ ను తెలియజేస్తున్న ఈ డాటా రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలపై పునరాలోచన చేసుకోవాలని సూచిస్తోంది.   

ప్రతిపక్షాల విషయానికి వస్తే 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ మోదీ ముందు ఇండియా కూటమి నిలవలేదని 60.33 శాతం అభిప్రాయపడ్డారు. ఆసక్తికర విషయం ఏమిటంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమయ్యింది.  కేవలం 32.28 శాతం మాత్రమే ఇండియా కూటమి మోదీని ఎదుర్కోగలదని పేర్కొన్నారు.  ఏషియా నెట్ న్యూస్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో పాల్గొన్న  48 శాతం మంది ప్రతిపక్ష కూటమి ఓటమికి మూడు ప్రధాన కారణాలున్నాయని తేల్చారు. నాయకత్వలేమి, లక్ష్యం లేకపోవడం, అలాగే చాలామంది ప్రధాని అభ్యర్థులు వుండటమే ప్రతిపక్షాలు దెబ్బతింటున్నాయని తేల్చారు. 

Asianet News Mood of the Nation Survey Result 2024

ఇటీవల కీలక నేతల రాజీనామాలు కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారాయి.  ఆ పార్టీ భవిష్యత్ పై నమ్మకంలేకనే నాయకులు పార్టీని వీడుతున్నట్లు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ద్వారా అర్థమవుతుంది.  మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఆ పార్టీ భవిష్యత్ ను మార్చలేదని 54.76 శాతం అభిప్రాయపడ్డారు. అంటే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్నది మెజారిటీ అభిప్రాయం. కేవలం 38.2 శాతం మాత్రమే రాహుల్ న్యాయ యాత్ర కాంగ్రెస్ కు మంచి ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నారు. 

నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రశ్నించగా.... మణిపూర్ లో గిరిజన తెగల మధ్య చోటుచేసుకున్న హింసాకాండను అదుపుచేయలేకపోవడమని 32.86 శాతం అభిప్రాయపడ్డారు.  భూమి, వనరులు, రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించి మణిపూర్ లో కుకీ-జో తెగల మధ్య వివాదం తలెత్తింది... ఇది తీవ్ర హింసకు దారితీసింది. తొమ్మిది నెలలపాటు ఈ హింస కొనసాగి  180 మంది ప్రాణాలు కోల్పోగా మరో 50,000 మంది తమ ప్రాంతాన్ని వదిలివెళ్లాల్సి వచ్చింది.  మణిపూర్ అల్లర్ల తర్వాత మోదీ సర్కార్ ఇంధన ధరలు (26.2 శాతం), నిరుద్యోగిత (21.3 శాతం), ద్రవ్యోల్భణం (19.6 శాతం) విషయంలో విఫలమయ్యిందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. హిందీ మాట్లాడే ప్రాంతాలతో పాటు తమిళనాడు ప్రజలు మాత్రం ధరల పెరుగుదల (41.79) మోదీ సర్కార్ ఫెయిల్యూర్ గా అభిప్రాయపడ్డారు. 

ఇక లోక్ సభ ఎన్నికలకు ముందు దేశంలో ఉత్తర, దక్షిణ  విభజన ఉద్దేశపూర్వకంగానే జరుగుతోందని  51.36 శాతం మంది అభిప్రాయపడ్డారు. కేవలం 35.28 శాతం మాత్రమే ఈ వాదనకు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. 

మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో మధ్యతరగతి ప్రజల గురించి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర రిజల్ట్ వచ్చింది.  మోదీ పాలనలో  మధ్యతరగతి ప్రజల జీవనప్రమాణాలు మారాయా? అని అడిగితే 47.8 శాతం మంది అవుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. మరో 46.1 శాతం మంది వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఈ డాటా అటు అధికార, ఇటు ప్రతిపక్షాలను ఆలోచింపజేస్తుంది. 

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిందని 51.07 శాతం,  మరో 42.97 శాతం మంది భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇదే సమయంలో ఎన్డిఎ పరిపాలనలో అవినీతిని అరికట్టారని 60.4 శాతం, విదేశాంగ విధానంపై మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బావుందని  56.39 శాతం అభిప్రాయపడ్డారు.  ఇక భారత సరిహద్దుల్లో మరీముఖ్యంగా చైనాను ఎదుర్కొనడంలో మోదీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సంతృప్తికరంగా వుందని 65.08 శాతం, లేదని 21.82 శాతం అభిప్రాయం. ఇక అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరిస్థితి మెరుగుపడిందని 79.27 శాతం అభిప్రాయపడ్డారు. 

చివరగా రాబోయే ఐదేళ్లు దేశాన్ని సమర్ధవంతంగా ఎవరు పాలించగలరని అడగ్గా అత్యధికంగా 78.6 శాతం ఎన్డీఏ ను ఎంచుకున్నారు.  కేవలం 21.4 మంది ఇండియా కూటమి పక్షాన నిలిచారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios