ఏషియానెట్ న్యూస్ రాసిన వార్తకు భారత ఆర్మీ కదిలినట్టు తెలుస్తున్నది. గాల్వన్ లోయ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఓ జవానుకు వారి కుటుంబం స్మారకంగా విగ్రహం నిర్మిస్తున్నది. ఆ నిర్మాణంలోనూ స్థానికంగా ఆటంకాలు వస్తున్నాయి. వాటిని ఏషియానెట్ న్యూస్ తొలిసారిగా రిపోర్ట్ చేసింది. తాజాగా, ఇండియన్ ఆర్మీ నుంచి ఒక టీమ్ జవాను కుటుంబాన్ని కలిసినట్టు, పోలీసు స్టేషన్‌కూ వెళ్లినట్టు సమాచారం. 

న్యూఢిల్లీ: 2020 గాల్వన్ లోయ చైనా ఆర్మీతో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాను జై కిశోర్ సింగ్ స్మారకం నిర్మాణం కోసం తండ్రి రాజ్ కపూర్ సింగ్ ఎదుర్కొంటున్న సవాళ్లను తొలిసారిగా ఏషియానెట్ న్యూస్ రిపోర్ట్ చేసింది. ఈ కథనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మిగతా జాతీయ మీడియా సంస్థలూ రాజ్ కపూర్ సింగ్ కష్టాలను రిపోర్ట్ చేసే పనిలో పడగా.. ఏషియానెట్ న్యూస్ రిపోర్ట్‌తో భారత ఆర్మీ రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. ఆ అమరజవాను కుటుంబానికి అండగా నిలబడి వారికి సహకరించడానికి సిద్ధమైనట్టు సమాచారం.

బిహార్‌లోని వైశాలి జిల్లా జండాహా బ్లాక్ చక్‌ఫతేహ్ గ్రామాన్ని ఓ ఆర్మీ టీమ్ సందర్శించింది. రాజ్ కపూర్ సింగ్ కుటుంబాన్ని కలిసి, వారికి అన్ని విధాల సహకరిస్తామని హామీ ఇచ్చింది.

అమరుడైన సోల్జర్ జై కిశోర్ స్మారకం నిర్మాణం ప్రారంభానికి ముందే భూ వివాదంపై పంచాయితీలో ఓ పరిష్కారం తెచ్చుకున్నారు. రాజ్ కపూర్ సింగ్ భూమి పక్కనే హరినాథ్ రామ్ భూమి ఉన్నది. ఈ వీటి ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిలో జై కిశోర్ స్మారకం నిర్మిస్తున్నారు. తమ భూమిలోకి దారి లేకుండా అవుతున్నదని హరినాథ్ రామ్ అభ్యంతరం పెట్టాడు. గ్రామస్తులంతా పంచాయితీ పెట్టగా.. ఆ భూమిని వదిలిపెడితే సమీపంలోని మరో చోట భూమి కొనుగోలు చేసి అప్పగిస్తామని రాజ్ కపూర్ ప్రతిపాదించగా.. అందుకు హరినాథ్ రామ్ అంగీకరించాడు. ఆ తర్వాత అక్కడ స్మారకం నిర్మాణం ప్రారంభించారు. పూర్తి కావొస్తుండగా హరినాథ్ రామ్ ఆ ఒప్పందాన్ని అతిక్రమించాడు. తనకు రాజ్ కపూర్ సింగ్ కొనుగోలు చేసిన భూమి అక్కర్లేదని, తన భూమి ఎదుట స్మారకం నిర్మించవద్దని యూటర్న్ తీసుకున్నాడు. అంతేకాదు, రాజ్ కపూర్ సింగ్ పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు.

అమరుడైన జై కిశోర్ అన్న నందకిశోర్ సింగ్ కూడా ఆర్మీలో చేస్తున్నాడు. అతను సోమవారం ఏషియానెట్ న్యూస్‌తో మాట్లాడాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక డీఎస్పీ తమ ఇంటికి వచ్చి తన తమ్ముడి విగ్రహాన్ని తొలగించాలని ఆదేశించాడని తెలిపారు. కానీ, ఆ కుటుంబం నిరాకరించింది. కొన్ని రోజుల తర్వాత జండామా ఎస్‌హెచ్‌వో వారి ఇంటికి వచ్చి రాజ్ కపూర్ ను ఇంటిలో నుంచి బయటకు లాక్కొచ్చి బహిరంగంగా దూషించి ఫిబ్రవరి 25వ తేదీన పోలీసు జీపులోకి ఎక్కించారు.

ఈ క్రమంలోనే పంచాయితీలో కుదిరిన ఒప్పందా తాలూకు ఒప్పంద పత్రాన్ని సర్కిల్ ఆఫీసర్ ఇవ్వలేదనే విషయం ముందుకు వచ్చింది. ఇండియన్ ఆర్మీ సిబ్బంది ఒకరు జండాహా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్‌హెచ్‌వో బిశ్వనాథ్ రామ్‌ను కలిసి కేసు గురించి అడిగి తెలుసుకున్నారు.

Also Read: గాల్వన్ అమర జవాను తండ్రికి అవమానం.. ఇంటి నుంచి బయటకు లాగి దూషించిన బిహార్ పోలీసులు

ఏషియానెట్ న్యూస్‌తో జండాహా ఎస్‌హెచ్‌వో బిశ్వనాథ్ రామ్ మాట్లాడుతూ, రాజ్ కపూర్‌ను చట్టబద్ధంగానే అరెస్టు చేశామని, అతను చట్టాన్ని అతిక్రమిస్తున్నట్టు తమ సీనియర్ అధికారులు గురర్తించారని వివరించారు. అతనికి పెద్ద మొత్తంలో భూమి ఉన్నదని, అతను తన స్వంత భూమిలోనూ విగ్రహాన్ని నిర్మించడానికి వీలు ఉన్నది అని తెలిపారు. అసలు ఈ విషయాన్ని రాజ్ కపూర్ కొడుకు నందకిశోర్ రాజకీయం చేస్తున్నాడని వివరించారు. గ్రామంలో బజరంగ్ దళ్, ఇతర సంఘాల సభ్యులు కొందరు అశాంతి ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

తాము ఎవరినీ ఇక్కడకు పిలవలేదని, తమ పట్ల సానుభూతి ఉన్నవారు అన్యాయం చూసి ముందుకు వచ్చారని నందకిశోర్ తెలిపారు. పోలీసులు ఎవరినీ అలా బయటకు లాక్కొచ్చి దూషణలు చేయరాదు అని వివరించారు. ఆ విగ్రహాన్ని సొంత భూమిలోనే ఎందుకు నిర్మించకూడదని అడగ్గా.. తమ తల్లి వయోవృద్ధురాలు అని, ఆమె తన కొడుకు జై కిశోర్‌ను రోజూ చూడాలని అనుకుంటున్నదని, అందుకే అక్కడ స్మారక విగ్రహం నిర్మించినట్టు వివరించారు. అక్కడ హరినాత్ రామ్ అంగీకారంతోనే స్మారకాన్ని నిర్మించామని, గతేడాది ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభ కార్యక్రమానికీ అతను హాజరయ్యాడని గుర్తు చేశారు.

హరినాథ్ రామ్‌కు తాము భూమి ఇచ్చేవాళ్లమేనని, కొన్ని నెలల ముందే ఆ భూమి కొనుగోలు చేశామనీ చెప్పారు. కానీ, వారు ఆ భూమిని కొనడానికి నిరాకరించి ఎష్సీఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టారని వివరించారు. హరినాథ్ రామ్ చెప్పినట్టుగానే పోలీసులు నడుచుకుంటున్నారని, తనపైనా నకిలీ కేసు పెడతామని పోలీసులు హెచ్చరించారని తెలిపారు.

రాజ్ కపూర్ కేసులో రాజకీయ ఉదాసీనత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ సైనికుడికి స్మారకం నిర్మిస్తామని, ప్రభుత్వ భూమిలో నిర్మిస్తామని పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. కానీ, అవి కార్యరూపం దాల్చలేవు. ఆ కుటుంబమే స్వయంగా అమరజవాను స్మారక విగ్రహం నిర్మిస్తున్నది. ఆ కార్యం నిర్వహించడానికి కూడా కుటుంబం తమను తాము కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సి వస్తున్నది.