గాల్వన్ లోయలో చైనా ట్రూపులతో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో మరణించిన అమర జవాను తండ్రికి బిహార్‌లో అవమానం జరిగింది. పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చారు. దూషించారు. ఇదంతా అమరుడైన అతని కొడుకు విగ్రహాన్ని స్మారకంగా నిర్మించినందుకు జరిగింది. 

పాట్నా: రెండేళ్ల క్రితం గాల్వన్ లోయలో చైనా ట్రూపులతో జరిగిన హింసాత్మక ఘర్షణలో బిహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన రాజ్ కపూర్ సింగ్ కుమారుడు జై కిశోర్ సింగ్ అమరుడయ్యాడు. జవాన్ జై కిశోర్ సింగ్ అమరత్వానికి ఆ రోజు దేశమంతా రాజ్ కపూర్ సింగ్‌తో పాటు సంతాపం తెలిపింది. కానీ, ఈ రోజు అమర జవాన్‌ను జన్మనిచ్చిన ఆ తండ్రిని బిహర్ పోలీసులు అవమానించారు. ఇంటిలో నుంచి బయటకు లాక్కొచ్చారు. దూషించారు. ప్రస్తుతం అతను జైలు ఊచల వెనుక ఉన్నాడు. ఆయన చేసిన నేరమేంటి? అమరుడైన కొడుకు జై కిశోర్ సింగ్ విగ్రహాన్ని స్మారకంగా వారి స్వగ్రమం చక్‌ఫతేహ్‌లో ప్రభుత్వ స్థలంలో నిర్మించతలపెట్టడమే నేరంగా మారింది.

ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. రాజ్ కపూర్ సింగ్‌తో హరినాథ్ రామ్‌కు భూమి పంచాయితీ ఉన్నదని, హరినాథ్ రామ్ ఫిర్యాదు ఆధారంగా రాజ్ కపూర్ సింగ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయిందని చెప్పారు. 

ఈ ఘటనపై ఏషియానెట్ న్యూస్ మరింత లోతుగా విషయాలు తెలుసుకుంది.

ఏం జరిగింది?

ఒకే గ్రామంలో హరినాథ్ రామ్, రాజ్ కపూర్‌లకు పక్కపక్కనే సరిహద్దు పంచుకుంటూ భూమి ఉన్నది. వారి భూమి ఎదురుగా ప్రభుత్వ భూమి ఉన్నది. చాలా మంది మంత్రులు, అధికార, విపక్ష నేతలు రాజ్ కపూర్ సింగ్ ఇంటికి వచ్చారు. జై మరణం గురించి సానుభూతి తెలిపి ఆయన పేరిట స్మారకం నిర్మిస్తామనే హామీలు ఇచ్చి వెళ్లిపోయారు. కానీ, అందుకు భూమి కేటాయించలేదు. జిల్లా యంత్రాంగం కూడా ఆసక్తి చూపలేదు.

రాజ్ కపూర్ కుటుంబం ఏం చెబుతున్నది?

వారి భూములకు ఎదురుగా ఎన్న ప్రభుత్వ భూమిలో స్మారకం నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించారు. కానీ, హరినాథ్ అభ్యంతరం తెలిపాడు. జండాహా బ్లాక్ సర్కిల్ అధికారి సమక్షంలో పంచాయితీ పెట్టగా.. అక్కడ స్మారకం నిర్మించడానికి హరినాథ్ అంగీకరించాడు. ఆ భూమిపైనా హక్కులు వదులుకుంటే సమీపంలోనే మరో చోట అంతే భూమి కొనిస్తామని రాజ్ కపూర్ ప్రతిపాదించగా.. హరినాథ్ అంగీకరించాడు. ఆ తర్వాత జై కిశోర్ సింగ్ విగ్రహంతో స్మారకం నిర్మించడం మొదలు పెట్టారు. దాదాపు ఆ నిర్మాణం కావొస్తుండగా హరినాథ్ మళ్లీ అభ్యంతరం తెలిపాడు. రాజ్ కపూర్ పై నెల క్రితం ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెట్టాడు.

అమర జవాను జై కిశోర్ సింగ్ అన్న నందకిశోర్ సింగ్ కూడా ఇండియన్ ఆర్మీలో చేస్తున్నాడు. ఆయన ఏషియానెట్ న్యూస్‌తో మాట్లాడాడు. ‘మాకు ఎఫ్ఐఆర్ గురించి తెలియదు. ఒక రోజు డీఎష్పీ మా ఇంటికి వచ్చి జై విగ్రహాన్ని తొలగించాలని ఆదేశించాడు. మేం చట్టాన్ని పాటించే పౌరులం. కానీ, జండాహా పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో మా నాన్నను ఇంటిలో నుంచి బయటకు లాగాడు. పబ్లిక్ గా దూషించాడు. ఇది మేం అంగీకరించం. సరిహద్దులో కఠిన పరిస్థితుల్లో దేశం కోసం మేం పోరాడుతుంటే.. ఇంటికాడ వయసు మీరిన మా తల్లిదండ్రులపై పోలీసులు వేధిస్తున్నారు’ అని తెలిపాడు.

‘ఈ సమస్యను అధికారులు, పోలీసులు సర్ది చెప్పి పరిష్కరిస్తే బాగుండేది. కానీ, జండాహా ఎస్‌హెచ్‌వో ఇలా ప్రవర్తించడానికి ఏం ప్రేరేపించాయో నాకు అర్థం కావడం లేదు’ అని చెప్పాడు. ‘ఇది భూ వివాద కేసు. ఇందులో ఎస్సీఎస్టీ యాక్ట్ ఎలా ప్రయోగించారు? ఇది కచ్చితంగా చట్టాన్ని దుర్వినియోగపరచడమే. పంచాయితీలో కుదిరిన ఒప్పందం మేరకు మేం మరో చోట భూమి కూడా కొనిచ్చాం. కానీ, వారు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు’ అని వివరించాడు.

ఫిర్యాదిదారు ఏమంటున్నాడు?

‘రాజ్‌కపూర్‌కు ఊరిలో చాలా భూమి ఉన్నది. ఆయన ఎక్కడైనా స్మారకాన్ని నిర్మించుకోవచ్చు. కానీ, నా భూమి ఎదురుగానే ఎందుకు నిర్మిస్తున్నాడు. జైకిశోర్ పేరిట స్మారకం నిర్మించాలని మేం కూడా కోరుకుంటున్నాం. ఆయన నాకు సోదరుడు లాంటివాడు’ అని హరినాథ్ కొడుకు మనోజ్ కుమార్ ఏషియానెట్ న్యూస్‌కు తెలిపాడు.

ఆ అగ్రిమెంట్ గురించి అడగ్గా.. అప్పుడు సొసైటీ ఒత్తిడితో అంగీకరించకతప్పలేదని అన్నాడు. ఇప్పుడు ఆ అగ్రిమెంట్‌ను అంగీకరించట్లేదని వివరించాడు.

Scroll to load tweet…

పోలీసులు ఏమంటున్నారు?

‘ఆ స్మారకాన్ని బిహార్ ప్రభుత్వ భూమిలో నిర్మించారు. కానీ, అక్కడ రోడ్డు పడాల్సి ఉన్నది. ఆ భూమి వెనుక ఇద్దరీ భూములూ ఉన్నాయి. రోడ్డుకు వేసే దారిని అడ్డుకుంటూ రాజ్ కపూర్ స్మారకం నిర్మించాడు. అందుకు అనుమతులు తీసుకోలేదు. ఆయన వారి సొంత భూమిలోనైనా లేదా ప్రభుత్వ భూమిని అడిగి అందులోనైనా స్మారకం నిర్మించాల్సింది. అంతేకానీ, ఫిర్యాదుదారుడి భూమిలోకి దారి లేకుండా స్మారకం నిర్మించుకోవడం వల్లే ఇక్కడ సమస్య ఉత్పన్నమైంది’ అని మహువా ఎస్‌డీపీవో పూనమ్ కేసరీ తెలిపారు. జనవరి 23న హరినాథ్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. చట్టబద్ధంగానే రాజ్ కపూర్‌ను అరెస్టు చేశాం’ అని ఆమె తెలిపారు.

గ్రామస్తులేమంటున్నారు?

ఓ గ్రామస్తులు ఏషియానెట్ న్యూస్‌తో మాట్లాడుతూ, ఎప్పడైనా దొంగతనాలు జరిగినప్పుడు పోలీసులు స్పాట్‌కు రానే రారు. ఇటీవలే ఓ ఎల్ఐసీ ఏజెంట్ మోటర్ సైకిల్ పోయింది. కానీ, జండాహా పోలీసులు అక్కడికి ఎంతో కాలానికి గాని వెళ్లనేలేదు’ అని అన్నాడు.

మరో గ్రామస్తులు ఎస్‌హెచ్‌వో కులదురహంకారి అని, ముందస్తుగా అభిప్రాయాలు కలిగిన వ్యక్తిగా పేర్కొన్నాడు. జండాహా బ్లాక్ సర్కిల్ ఆఫీసర్‌ అభిప్రాయం తీసుకోవాలని ఏషియానెట్ న్యూస్ భావించింది. కానీ, అతని ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది.