ఢిల్లీ ప్రభుత్వంలోని బ్యూరోక్రాట్లపై కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ కల్పించే ఢిల్లీ సర్వీసెస్ బిల్లును పార్లమెంట్ లో వ్యతిరేకించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు. ఈ విధేయతను ఎప్పుడూ గుర్తుంచుకుంటామని ఆయన లేఖ రాశారు.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేసినందుకు, తమ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడికి కేజ్రీవాల్ లేఖ రాశారు. అందులో ‘‘పార్లమెంటు లోపల, వెలుపల ఢిల్లీ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మన రాజ్యాంగ సూత్రాల పట్ల మీ అచంచల విధేయత దశాబ్దాలుగా గుర్తుండిపోతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు ప్రధాని అయ్యే అవకాశం రాలేదు.. ఎందుకంటే..- ప్రధాని మోడీ
రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న శక్తులపై పోరాటంలో రాహుల్ గాంధీ నిరంతర మద్దతు కోసం తమ పార్టీ ఎదురు చూస్తోందని కేజ్రీవాల్ చెప్పారు. ‘‘జీఎన్సీటీడీ (సవరణ) బిల్లును తిరస్కరించడానికి, వ్యతిరేకంగా ఓటు వేయడానికి మీ పార్టీ మద్దతు ఇచ్చినందుకు ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ నేను మీకు లేఖ రాస్తున్నాను.’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కాగా.. ఢిల్లీ ప్రభుత్వంలోని బ్యూరోక్రాట్లపై కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ కల్పించే ఢిల్లీ సర్వీసెస్ బిల్లును పార్లమెంటు సోమవారం ఆమోదించింది. రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. దేశ రాజధానిలో సమర్థవంతమైన, అవినీతి రహిత పాలన అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రభుత్వ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023 ను సమర్థించారు.
ఈసారి ఇంజన్లు ఫెయిల్ అయినా.. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది - ఇస్రో చీఫ్ సోమనాథ్
ఆగస్టు 4న లోక్ సభలో వాయిస్ ఓటింగ్ ద్వారా ఈ బిల్లు ఆమోదం పొందింది. ఢిల్లీ ప్రభుత్వంలో అధికారుల బదిలీలు, పోస్టింగ్ ల నిర్వహణపై ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. కాగా.. ఈ వివాదాస్పద బిల్లు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఏకతాటిపైకి తీసుకురావడానికి కారణమయ్యింది. ఈ బిల్లును వ్యతిరేకించాలని ఆప్ కాంగ్రెస్ ను పలుమార్లు కోరింది. అనేక అభ్యర్థనల తరువాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ సర్వీసెస్ బిల్లును వ్యతిరేకించింది. అయితే ఈ బిల్లును నెగ్గించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.
