పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనంపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ప్రధాని చెప్పిన విషెస్ కు శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రధాని ట్వీట్ కు సమాధానం ఇచ్చారు.
పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సాధించింది. 117 స్థానాల్లో ఆప్ 92 స్థానాలు కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీ పంజాబ్ (Punjab)లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ (congress) పార్టీ అధికార పీఠం నుంచి దిగిపోనుంది. ఎన్నికలకు ముందే ఆప్ భగవంత్ మాన్ (bhagwant mann)ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆయన సీఎంగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ (pm narendra modi) గురువారం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ పంజాబ్ ఎన్నికలలో ఆప్ విజయం సాధించినందుకు నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. పంజాబ్ సంక్షేమం కోసం కేంద్రం నుండి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్నాను. @AamAadmiParty ’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ పై ఒక రోజు తరువాత శుక్రవారం ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) స్పందించారు. ప్రధాని ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ ‘థ్యాంక్యూ సార్‘ అంటూ సమాధానం ఇచ్చారు.
117 సీట్లలో 92 సీట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్, SAD-BSP కూటమని ఆప్ మట్టికరిపించింది. ప్రకాష్ సింగ్ బాదల్, అమరీందర్ సింగ్ వంటి సీనియర్ నాయకులు కూడా ఓడిపోయారు. ఓట్ల వాటా విషయానికొస్తే ఐదేళ్ల క్రితం 23.7 శాతం ఉన్నఆప్‌కు 42 శాతం పెరిగింది. అధికారిక ఫలితాల ప్రకారం పంజాబ్ లో కాంగ్రెస్ 18, శిరోమణి అకాలీదళ్ - 3, బీజేపీ- 2, బీఎస్పీ -1, అలాగే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా విజయం సాధించారు.
ఢిల్లీలో ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని AAP అధికారంలో ఉంది. అయితే పార్టీ స్థాపించిన అతి కొద్ది రోజుల్లోనే పక్క రాష్ట్రం అయిన పంజాబ్ లో కూడా ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. పంజాబ్‌లో పార్టీ పనితీరు ‘‘విప్లవం’’ అని కేజ్రీవాల్ ప్రశంసించగా, సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ ఆక్రమిస్తుందని ఆ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా అన్నారు. కాగా దాదాపు 60 ఏళ్ల తరువాత పంజాబ్ లో అత్యధిక స్థానాలను గెలుపొందిన ఒకే పార్టీగా ఆప్ రికార్డు సృష్టించింది.
2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో చరణ్‌జిత్ సింగ్ చన్నీ, అమరీందర్ సింగ్, ప్రకాష్ సింగ్ బాదల్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌లతో సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. బదౌర్‌లో ఆప్‌కి చెందిన లభ్‌సింగ్ ఉగోకే చేతిలో చరణ్ జిత్ సింగ్ చన్నీ 37,558 ఓట్ల తేడాతో చన్నీ ఓడిపోయారు. అలాగే చమ్‌కౌర్ సాహిబ్‌లో కూడా ఆయన ఆప్ నాయకుడి చేతిలో 7,942 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ ముక్త్‌సర్ జిల్లాలోని తన సాంప్రదాయ లంబి స్థానం నుండి ఆప్‌కి చెందిన గుర్మీత్ సింగ్ ఖుదియాన్ చేతిలో 11,396 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఫజిల్కా జిల్లాలోని జలాలాబాద్ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి జగదీప్ కాంబోజ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై 30,930 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పాటియాలా (అర్బన్) నుంచి ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ చేతిలో అమరీందర్ సింగ్ (79) 19,873 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
