ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సీబీఐ  విచారణకు  అరవింద్  కేజ్రీవాల్  హాజరయ్యారు.  రెండు రోజుల క్రితం  విచారణకు  రావాలని  సీబీఐ అధికారులు అరవింద్  కేజ్రీవాల్ కు  సమన్లు  పంపిన విషయం తెలిసిందే.   


న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారంనాడు హాజరయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెంట పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా ఉన్నారు. 

ఇవాళ ఉదయం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన నివాసం నుండి బయలుదేరి రాజ్ ఘాట్ కు చేరుకున్నారు. రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. రాజ ఘాట్ నుండి పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తో కలిసి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను విచారించనున్నందున సీబీఐ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ను విధించారు పోలీసులు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఉన్న పోస్టర్లను తొలగించారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు విచారించడంపై ఆప్ కార్యకర్తలు నిరసనకు ప్రయత్నించారు. నిరసనకు యత్నించిన ఆప్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

2021-22 ఎక్సైజ్ పాలసీ రూపొందించే సమయంలో మద్యం లాబీకి అనుకూలంగా వ్యవహరించారని ఈడీ, సీబీఐలు కేజ్రీవాల్ సర్కార్ పై ఆరోపణలు చేస్తున్నాయి .ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై సీబీఐ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను విచారించే అవకాశం లేకపోలేదు. 

also read:నేను అవినీతిపడినైతే ప్రపంచంలో నిజాయితీపరుడే ఉండరు: అరవింద్ కేజ్రీవాల్

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ తరుణంలో ఢిల్లీసీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ విచారించడాన్ని విపక్ష నేతలు తప్పుబట్టారు. అరవింద్ కేజ్రీవాల్ కు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్, తదితరులు మద్దతు ప్రకటించారు.