ఆర్మీ మేజర్ కిరాతకం.. మరో మేజర్ భార్య దారుణ హత్య

Army Major Wanted To Marry Officer's Wife, Killed When She Refused: Cops
Highlights

తనతో పెళ్లికి అంగీకరించలేదనే అక్కసుతోనే..

తనతో పెళ్లికి అంగీకరించలేదని ఓ ఆర్మీ మేజర్.. మరో మేజర్ భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. అసలు ఏం జరిగిందంటే... ఢిల్లీ  కంటోన్మెంట్‌ ప్రాంతంలో శనివారం సాయంత్రం మేజర్‌ అమిత్‌ ద్వివేది భార్య శైలజ ద్వివేది (33) మృతదేహం లభ్యమైంది.
 ఆమెను మేజర్‌ నిఖిల్‌ హండా గొంతు కోసి హత్య చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. తనను ఆమె పెళ్లి చేసుకునేందుకు అంగీకరించట్లేదన్న అక్కసుతోనే అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడని వివరించారు. హండాకు శైలజతో వివాహేతర సంబంధం ఉందని మరో అధికారి అన్నారు. ఇటు హత్య అనంతరం బాధితురాలిపై నుంచి కారు పోనిచ్చి.. ఘటనను హండా రోడ్డు ప్రమాదంలా చిత్రించే ప్రయత్నం చేశాడని సీనియర్‌ పోలీసు అధికారి విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.
 
‘‘మూడేళ్ల క్రితం నుంచి అమిత్‌ కుటుంబంతో హండాకు పరిచయం ఉంది. అప్పుడు వారు నాగాలాండ్‌లో కలిసి పనిచేసేవారు. అమిత్‌కు దిల్లీకి బదిలీ కావడంతో.. శైలజ కూడా ఆయనతోపాటు ఇక్కడికి వచ్చేశారు. శైలజను హండా ఇష్టపడేవాడు. తరుచూ తనను పెళ్లిచేసుకోమని ఆమెను కోరేవాడు. ఆమె అందుకు నిరాకరిస్తూ వచ్చారు. శైలజ మొబైల్‌ ఫోన్‌లోని సమాచారం ఆధారంగా.. హండాతో ఆమెకు విభేదాలు తలెత్తినట్లు గుర్తించాం. ఫిజియోథెరపీ చేయించుకునేందుకు అని చెప్పి.. శైలజ తన భర్త అధికారిక వాహనంలో ఉదయం కంటోన్మెంట్‌ ప్రాంతంలోని సైనిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడికి హండా వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. అతడితో కలిసి శైలజ కారులో బయటకు వెళ్లారు. అమిత్‌ కూడా హండాపై అనుమానం వ్యక్తంచేశారు’’ అని విజయ్ కుమార్  తెలిపారు. 

కారులో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని.. దీంతో హండా కత్తితో శైలజ గొంతును కోశాడని పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ కంటోన్మెంట్‌లోని ఆఫీసర్స్‌ మెస్‌లో హండా తలదాచుకున్నట్లు తెలిసిందని.. ఆదివారం అక్కడి నుంచి కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. శైలజ, అమిత్‌లకు ఇద్దరు సంతానం ఉన్నట్లు పేర్కొన్నారు.

loader