ఆర్టికల్ 370కి ముగింపు: రిటైర్డ్ ఆర్మీ అధికారుల అభినందనలు
జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని ఇచ్చే 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది.ఈ విషయమై కొందరు రిటైర్డ్ ఆర్మీ అధికారులు కేంద్రం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని ఇచ్చే 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5వ తేదీన భారత పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సోమవారంనాడు సమర్ధించింది. ఐదుగురు సుప్రీంకోర్టు జడ్జిల ధర్మాసనం ఇవాళ ఈ విషయమై తీర్పును వెల్లడించింది.
ఆర్టికల్ 370 కు ముగింపు పలకడాన్ని రిటైర్డ్ ఆర్మీ అధికారులు స్వాగతిస్తున్నారు.370 ఆర్టికల్ భారత్ ప్రయోజనాలకు, భద్రతకు అడ్డంకిగా ఉందని వేద్ మాలిక్ అనే రిటైర్డ్ ఆర్మీ చీఫ్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని ప్రకటించారు. ఆర్టికల్ 370తో పాటు 35 ఏ ను కూడ తొలగించాలని కేజేఎస్ దిల్షాన్ అభిప్రాయపడ్డారు.కాశ్మీర్ సమస్యకు ఎట్టకేలకు అత్యున్నత న్యాయస్థానం ద్వారా పరిష్కారం లభించిందని మరో రిటైర్డ్ ఆర్మీ అధికారి బ్రజేష్ కుమార్ అభిప్రాయపడ్డారు.
సత్యమే వజయతే అంటూ రిటైర్డ్ మేజర్ పవన్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
భారత్ తో జమ్మూ కాశ్మీర్ ఏకీకరణ ఇప్పుడు పూర్తైందని రిటైర్డ్ కల్నల్ ఎస్. డిన్నీ చెప్పారు.సుప్రీంకోర్టు తీర్పుతో అన్ని వివాదాలకు తెరపడేలా చేసిందని రిటైర్డ్ ఆర్మీ అధికారి జైకౌల్ చెప్పారు.70 ఏళ్లుగా ఉన్న గందరగోళానికి తెరపడిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందన్నారు.