ఇటీవల పోలీసులపై దాడులు ఎక్కువవుతున్నాయి. శాంతి భద్రతలను కాపాడే పోలీసులకే రక్షణ లేకుండా పోతోంది. నిన్న హర్యానాలో డీఎస్పీని మైనింగ్ మాఫియా వాహనంతో ఢీకొట్టి చంపగా.. తాజాగా జార్ఖండ్ లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
హర్యానాలోని నుహ్‌లో మైనింగ్ మాఫియా డీఎస్పీ సురేంద్ర సింగ్ ను ట్రక్ తో ఢీకొట్టి హతమార్చిన 24 గంటల్లోనే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని రాంచీలో వాహన తనిఖీ లు చేపడుతున్న సమయంలో మహిళా ఎస్ఐ ను కూడా స్మగ్లర్లు అదే విధంగా హత్య చేశారు. పశువులను అక్రమంగా తరలిస్తున్న పికప్ వ్యాన్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్ఐ సంధ్యా తోప్నా ను వాహనంతో తొక్కి చంపారు.
బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. పికప్ వాహనంలో పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు సిమ్‌డెగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు బృందం ఆ వాహనాన్ని వెంబడించడం ప్రారంభించింది. దీంతో ఆ పికప్ వాహనం డ్రైవర్ వేగాన్ని పెంచాడు. ఈ విషయాన్ని కమదారా పోలీస్ స్టేషన్‌కు అందజేశారు. దీంతో ఆ పోలీసులు అక్కడ వాహనాన్ని ఆపేందుకు అడ్డంకిని ఏర్పాటు చేశారు. కానీ పికప్ డ్రైవర్ దానిని బద్దలు కొట్టి పారిపోయాడు. అనంతరం ఆ పికప్ టోర్పా పోలీసులు ఏర్పాటు చేసిన అడ్డంకిని దాటి వెళ్లి కుంటి పోలీసులను కూడా తప్పించుకుంది.
రాహుల్ గాంధీకి రాజకీయంగా ఉత్పాదకత లేదు - కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ
ఈ విషయాన్ని రాంచీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఖుంటి-రాంచీ సరిహద్దులో పోలీసులు వెహికిల్ చెకింగ్ ను ముమ్మరం చేసింది. పికప్ వ్యాన్ వస్తున్నట్లు గమనించిన ఎస్‌ఐ సంధ్యా తోప్నా దానిని ఆపేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమెను కూడా వాహనంతో ఢీకొట్టి పారిపోయాడు. అయితే అలాగే పారిపోతున్న క్రమంలో పికప్ వెహికల్ బోల్తా కొట్టింది. దీంతో స్మగ్లర్ అందులో నుంచి బయటకు వచ్చి పారిపోయాడు. గాయపడిన డ్రైవర్ ను పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
పారిపోయిన నిందితుడిని పోలీసు సీసీ పుటేజ్ సాయంతో గుర్తించి అరెస్ట్ చేశారు. వాహనాన్ని కూడా సీజ్ చేశారు. “సంధ్యా టాప్నో అనే మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ నిన్న రాత్రి వాహన తనిఖీలో మరణించారు. నిందితుడిని అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. అనేక జంతువులు కూడా గాయపడ్డాయి. ’’ అని రాంచీ ఎస్‌ఎస్పీ కౌశల్ కుమార్ తెలిపారు.
అయితే విచ్చలవిడిగా సాగుతున్న పశువుల అక్రమ రవాణా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతోందని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనకు అధికార కూటమినే బాధ్యులను చేసింది. “ హేమంత్ సోరెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జార్ఖండ్‌లో పశువుల అక్రమ రవాణా గణనీయంగా పెరిగింది. పాలక కూటమి రక్షణలో పశువుల అక్రమ రవాణా జరుగుతోందని, దీని వల్ల శాంతిభద్రతలు ఛిన్నాభిన్నమయ్యాయని, రాష్ట్రం ఆ దిశగా పయనిస్తోందనడానికి ఈ ఘటనే ఉదాహరణ.’’ అని రాష్ట్ర బీజేపీ చీఫ్ దీపక్ ప్రకాశ్ అన్నారు.
