Subhas Chandra Bose: నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్‌కు రప్పించాలని ఆయన కూతురు అనితా బోస్ మరోసారి ప్రభుత్వాన్ని కోరారు. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన అవశేషాలకు డీఎన్‌ఏ పరీక్ష చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Subhas Chandra Bose: ‘నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను’ అనే నినాదంతో భారతీయుల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhas Chandra Bose). ఈ వీరుడు నేటీకి కోట్లాది భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని పలు నివేదికలు చెబుతున్నాయి. కానీ ఆయన మరణం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలింది. ఇదిలా ఉంటే మరోసారి నేతాజీ కుటుంబ సభ్యులు ఆయన చితాభస్మాన్ని రప్పించాలని కోరుతున్నారు. తాజాగా నేతాజీ కూతురు అనితా బోస్ ప్‌ఫాఫ్ (Anita Bose Pfaff) మరోసారి భారత ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వానికి నేతాజీ కూతురి విజ్ఞప్తి
ఈ ఆగస్టు 18న నేతాజీ వర్థంతి 80వ సంవత్సరం పూర్తి కానుంది. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారని అధికారిక కథనం చెబుతున్నా, ఆ మరణం పై రహస్యాలు, వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనితా బోస్ తన కోరికను మరోసారి వ్యక్తం చేశారు. “నా జీవితంలో అతిపెద్ద కోరిక ఏమిటంటే.. నా తండ్రి అస్థికలు స్వదేశానికి తిరిగి రావడాన్ని చూడటం. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచి ఉంచిన అవశేషాలు నేతాజీవే అన్న నమ్మకం ఉంది. వాటికి డీఎన్‌ఏ పరీక్ష జరిపి అన్ని అనుమానాలకు తెరదిద్దాలి” అని ఆమె రిక్వెస్ట్ చేశారు. నేతాజీ మరణంపై ఉన్న అనుమానాలను తొలగించి, శాస్త్రీయ ఆధారాలతో ఒక సమాధానం ఇవ్వాలని, ఆయన జ్ఞాపకాలను గౌరవించేందుకు ప్రభుత్వం ముందడుగు వేయాలని అనితా బోస్ కోరారు. ఈ నెలాఖర్లో ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో అనితా బోస్ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.
నేతాజీ అస్థికలు రెంకోజీ ఆలయానికి ఎలా చేరాయి?
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవశేషాలు జపాన్‌లోని టోక్యో రెంకోజీ ఆలయానికి ఎలా చేరాయి? అన్న ప్రశ్నకు సమాధానం 1965లో జపాన్ ప్రభుత్వం చేసిన దర్యాప్తు నివేదికలో వెలువడింది. 1945 ఆగస్టులో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత ఆయన అంత్యక్రియలు అప్పటి తైహికు ప్రిఫెక్చర్ (ప్రస్తుత తైవాన్ రాజధాని తైపీ)లో జరిగాయి. అంత్యక్రియల అనంతరం నేతాజీ చితాభస్మాన్ని ఆయన సన్నిహిత సహచరుడు ఎస్‌ఏ అయ్యర్ స్వాధీనం చేసుకున్నారు.
నేతాజీకి చెందిన మిగిలిన వ్యక్తిగత వస్తువులు మాత్రం జపాన్‌లోని ఇండియన్ ఇండిపెండెన్స్ అసోసియేషన్ చీఫ్ రామ్ మూర్తికి అప్పగించారు. 1945 సెప్టెంబర్ 8న రామ్ మూర్తి ఈ విలువైన వస్తువులను ఇంపీరియల్ ప్రధాన కార్యాలయానికి అందించారు. అనంతరం, 1945 సెప్టెంబర్ 14న నేతాజీ చితాభస్మాన్ని జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉంచారు. భారత రాయబార కార్యాలయం నివేదిక ప్రకారం నేతాజీ అస్థికలు సుమారు 9 అంగుళాలు x 6 అంగుళాలు పరిమాణంలో ఉన్న ఒక ప్రత్యేక పెట్టెలో భద్రపరచబడ్డాయి. అప్పటినుంచి నేతాజీ అవశేషాలను ఆలయం కాపాడుతుంది.
ముఖర్జీ కమిషన్ నివేదిక
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలు ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ప్రత్యేక జాడిలో భద్రపరిచి ఉన్నాయి. నేతాజీ అవశేషాలను భారతదేశానికి తరలించే వరకు ఈ జాడిని తాను కాపాడతానని ఆలయ ప్రధాన పూజారి కయోయ్ మోచిజుకి ప్రతిజ్ఞ చేశారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 18న నేతాజీ వర్ధంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు, సమావేశాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో జపాన్, భారతదేశానికి చెందిన అనేక మంది దౌత్య అధికారులు, అనుచరులు పాల్గొని నేతాజీకి నివాళులర్పిస్తారు. రెంకోజీ ఆలయం అనేది నిచిరెన్ బౌద్ధ మతానికి చెందిన దేవాలయం. నేతాజీ అస్థికలను కాపాడటం, సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేక బాధ్యతగా మారింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ అస్థికల నిర్వహణ ఖర్చు కోసం భారత ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం డబ్బు చెల్లిస్తోంది. 1967 నుండి 2005 మధ్యకాలంలో మొత్తం రూ. 52,66,278 ఆలయానికి ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, 2005లో ముఖర్జీ కమిషన్ నివేదిక వెలువడిన తరువాత ఈ చెల్లింపులు ఆగిపోయాయి.
ప్రతి ప్రయత్నం విఫలమే!
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవశేషాలను భారత్ కు తీసుకురావడానికి గత 75 ఏళ్లుగా జరిగిన ప్రతి ప్రయత్నం విఫలమవడం చరిత్ర చెబుతోంది. తొలిసారి 1950లో తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నేతాజీ మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో బోస్ కుటుంబం నేతాజీ మరణాన్ని అంగీకరించకపోవడంతో ఆ యత్నం అర్ధాంతరంగా ఆగిపోయింది.
ఇక 1979లో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ని జపాన్ సైనిక నిఘా అధికారి అధికారి సంప్రదించారు. ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)లో నేతాజీకి సన్నిహితుడు. నేతాజీ చితాభస్మాన్ని భారతదేశానికి తీసుకెళ్లమని కోరారు. అయితే, అప్పటికి దేశాయ్ ప్రధాని పదవి కోల్పోవడంతో ఈ ప్రయత్నం కూడా విఫలమైంది. చివరిగా 2000లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతాజీ అవశేషాలను రప్పించేందుకు కృషి చేశారు. కానీ ఈ ప్రయత్నం కూడా సఫలం కాలేదు.
