Asianet News TeluguAsianet News Telugu

Netaji statue India gate: అక్క‌డ నేతాజీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తాం.. ప్ర‌ధాని మోడీ

Netaji statue India gate: స్వాతంత్య్ర ఉద్యమంలో విశేష‌ పోరాటం చేసిన‌ నేతాజీ సుభాశ్ చంద్రబోస్  గుర్తుగా ఆయ‌న విగ్రహాన్ని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా గ్రానైట్‌తో తయారు చేసిన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామనిప్ర‌ధాని మోడీ తెలిపారు. 

PM Modi says Statue of Subhash Chandra Bose to be installed at India Gate
Author
Hyderabad, First Published Jan 21, 2022, 2:27 PM IST

Netaji statue India gate: స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాశ్ చంద్రబోస్ చేసిన పోరాటానికి గుర్తుగా ఆయ‌న విగ్రహాన్ని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా గ్రానైట్‌తో తయారు చేసిన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని , ఈ విషయాన్ని అందరితో పంచుకుంటుండటం తనకు సంతోషంగా ఉందని ఓ ట్వీట్‌లో తెలిపారు. ఇది రుణం తీర్చుకునే, కృతజ్ఞతాభావానికి ప్రతీక అని ప్ర‌ధాని మోడీ తెలిపారు. 


నేతాజీ విగ్రహం తయారీ పూర్తయ్యే వరకు, విగ్రహం ఉన్న ప్రదేశంలో నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని చెప్పారు. నేతాజీ జయంతి అయిన జనవరి 23న హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాను అని ఆయన ట్వీట్ చేశారు. 

మొదటి ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. 1943లో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటు చేసి, బ్రిటిష్ పాలకులపై సాయుధ తిరుగుబాటును ప్రారంభించారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేవిధంగా వేలాది మంది భారతీయులను ప్రేరేపించారు. ‘‘నువ్వు నాకు రక్తాన్ని ఇవ్వు, నేను నీకు స్వాతంత్రం ఇస్తాను’’, ‘‘జైహింద్’’, ‘‘ఢిల్లీ చలో’’ వంటి నినాదాలు ఇచ్చారు.  

ప్రతీ ఏడాది 26న గణతంత్ర వేడుకలు జ‌రుగుతాయి.. కానీ ఈ  ఏడాది..  జనవరి 23 నుంచే గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి. జవనరి 24న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలను కూడా గణతంత్రదినోత్సవ వేడుకల్లో భాగంగా జర‌పాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఈ నిర్ణ‌యంతో ఈ ఏడాది నుంచి ప్రతి యేడాది జనవరి 23 నుంచే రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించనున్నారు.

భారత దేశ చరిత్ర, సంస్కృతి అంశాలను స్మరించుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. ఇందులో భాగంగా సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివాస్‌గా జరుపుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 14న దేశ విభజన సంస్మరణ దినోత్సవం, అలాగే..  సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31న జాతీయ ఐక్యత దివాస్ నిర్వ‌హిస్తోన్నారు. తాజాగా పరాక్రమ్ దివాస్ జరపనుంది. ఈ నిర్ణయాన్ని నేతాజీ కుటుంబ సభ్యులు స్వాగతించారు.

ఢిల్లీలో 26న జ‌రిగే గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు కొవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో కేవ‌లం 24 వేల మందికి అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది. గ‌తేడాది కూడా 25 వేల మందికి అనుమతించారు. సాధారణంగా రిప‌బ్లిక్ వేడుక‌ల్లో సుమారు ల‌క్షా 25 వేల మంది వరకు పాల్గొంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios