పాపం… కవలలుగా కలిసిపుట్టిన చిన్నారులను రోడ్డు ప్రమాదం దూరం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ చిన్నారి తల్లిదండ్రులు, కవల సోదరిని కోల్పోయి తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యింది. 

East Godavari Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రి-కాకినాడ మధ్య నిర్మాణంలో ఉన్న ఏడిబి రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు... వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదం ఎలా జరిగింది?

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం రఘుదేవపురం, రాజమండ్రి సమీపంలోని కలవచర్ల ప్రాంతాలకు చెందిన రెండు కుటుంబాలు సరదాగా చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. సోమవారం ఉదయం కారులో కాకినాడకు బయలుదేరారు... రోజంతా అక్కడి ఎన్టీఆర్ బీచ్ లో ఆనందంగా గడిపారు. పెద్దలతో పాటు పిల్లలు బీచ్ లో సాయంత్రం వరకు సరదాసరదాగా గడిపారు.

రాత్రి కావడంతో బీచ్ లో గడిపిన మధుర జ్ఞాపకాలకు నెమరువేసుకుంటూ ఇంటికి బయలుదేరారు. ఇలా ఎంతో ఆనందంతో సాగుతున్న వారి ప్రయాణం ఒక్కసారిగా విషాదంగా మారింది. కాకినాడ-రాజమండ్రి ఏడిఏ రహదారిపై వీరి కారు వేగంగా వెళుతూ అదుపుతప్పి పాల ట్యాంకర్ ను వెనకనుండి ఢీకొట్టింది. దీంతో కారులోనే ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ముందుగా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మృతదేహాలను బయటకుతీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాద మృతుల వివరాలు :

కాకినాడ-రాజమండ్రి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రేలంగి శివన్నారాయణ(40), ఇతడి భార్య దేవి లలిత (34), కూతురు వర్షిత (13), తీగిరెడ్డి శివ(30), ఇతడి కూతురు సాన్వి(4) ఘటనాస్థలిలోనే చనిపోయారు. శివన్నారాయణ మరో కూతురు హర్షిత (13), శివ భార్య తీగిరెడ్డి భవాని (26) తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

శివన్నారాయణ కుటుంబం మొత్తంలో కేవలం హర్షిత ఒక్కరే ప్రాణాలతో మిగిలారు. చనిపోయిన వర్షిత ఈ హర్షిత ఇద్దరు కవలపిల్లలు. కలిసి పుట్టిన ఈ ఇద్దరిని రోడ్డుప్రమాదం వేరుచేసింది. ఈ ప్రమాదం రఘునాథపురం, కవలగొయ్యి గ్రామాల్లో విషాదాన్ని నింపింది.

డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి :

తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, మడిపల్లి రాంప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన మంత్రులు ఎలాంటి సాయమైనా చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

ఇక కాకినాడ-రాజమండ్రి రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడినట్లు... కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.