Asianet News TeluguAsianet News Telugu

ఇండియా సీఈవో వైరస్‌కు వ్యాక్సిన్ లేదు.. భారత సంతతి సీఈవోలపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

ట్విట్టర్ నూతన సీఈవోగా భారత సంతతి పరాగ్ అగ్రావాల్ బాధ్యతలు తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు భారత సంతతి వ్యక్తులు నేతృత్వం వహించడంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా కరోనా భయాల నడుమ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఇది ఇండియన్ సీఈవో వైరస్ అని, దీనికి వ్యాక్సిన్ లేదని ట్వీట్ చేశారు.
 

anand mahindra tweets over new indian origin twitter CEO parag agrawal
Author
New Delhi, First Published Nov 30, 2021, 3:57 PM IST

న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలపై తనదైన కామెంట్ ఒకటి వదులుతుంటారు. చాలా సార్లు ఆయన రెస్పాన్స్ కూడా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా, Twitter నూతన CEOగా భారత సంతతి(Indian Origin) అధిరోహించడంపై తన మార్క్ శైలిలో కామెంట్ చేశారు. ఇండియాలో పెరిగి వచ్చిన వారే ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, అడాబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌ సంస్థల సీఈవోలుగా ఉన్నారని, ఇప్పుడు కొత్తగా ట్విట్టర్‌కు కూడా వారే నేతృత్వం వహిస్తున్నారని ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై అనేకులు స్పందించారు. ఎలన్ మస్క్ స్పందిస్తూ ఇండియా ట్యాలెంట్ ద్వారా అమెరికా ఎంతో లబ్ది పొందుతున్నదని పేర్కొన్నారు. కాగా, అదే ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా జోకింగ్‌గా కామెంట్ పెట్టారు. 

కరోనా మహమ్మారితో ప్రపంచం అంతా అతలాకుతలమైంది. ఇప్పుడు కొత్త వేరియంట్‌తో మరోసారి బెంబేలెత్తుతున్నది. అందరికీ మహమ్మారి అంటే వణుకు పుడుతున్నది. కానీ, ఒక్క మహమ్మారి పట్ల మనమంతా ఎంతో గర్వంగా ఉన్నామని, సంతోషిస్తున్నామని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇండియాలో మొదలైన ఈ మహమ్మారిపై అందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. అదే ఇండియన్ సీఈవో వైరస్ అని జోక్ చేశారు. అంతేకాదు, దానికి అసలు వ్యాక్సినే లేదని ముక్తాయింపు ఇచ్చారు.

Also Read: అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థల సీఈవోలుగా భారతీయులు.. జాబితా ఇదే

బాంబే ఐఐటీలో చదువుకున్న పరాగ్ అగ్రావాల్ ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. పరాగ్ అగ్రావాల్ 2011లో ట్విట్టర్ సంస్థలో చేరారు. 2017లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ట్విట్టర్ సంస్థలో చేరక ముందు పరాగ్ అగ్రావాల్ యాహూ, మైక్రోసాఫ్ట్, ఏటీఅండ్‌టీ ల్యాబ్స్‌లో సేవలు అందించారు. 2006 నుంచి 2010 వరకు ఆయన రీసెర్చ్ టీమ్స్‌తో కలిసి పని చేశారు. అగ్రావాల్ బీటెక్ డిగ్రీ పట్టా పొందారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీర్స్ చేశారు. అనంతరం కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ట్విట్టర్‌ అనూహ్యంగా అభివృద్ధి చెందడంలో (సాంకేతికపరంగా) పరాగ్ అగ్రావాల్ టెక్నికల్ స్ట్రాటజీ కీలకంగా ఉన్నది. ఆయనను ట్విట్టర్ సీఈవోగా ఎన్నుకోవడంపై పరాగ్ అగ్రావాల్ హర్షం వ్యక్తం చేశారు.

Also Read: తనను నిషేధించిన ట్విట్టర్ సంస్థ మాజీ సీఈవో జాక్ డోర్సీపై కంగనా కామెంట్.. ఎలన్ మస్క్ స్పందన

ట్విట్టర్ సీఈవోగా భారత సంతతి వ్యక్తి బాధ్యతలు స్వీకరించడంపై దేశమంతటా మారుమోగుతున్నది. ఇదే సందర్భంగా ఇది వరకే దిగ్గజ సంస్థలకు సీఈవోలుగా కొనసాగుతున్న వారిపైనా చర్చ జరిగింది. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచయ్, అడాబ్ సంస్థ సీఈవోగా శాంతాను నారాయణ్, ఐబీఎం సీఈవోగా అరవింద్ క్రిష్ణ, మైక్రాన్ టెక్నాలజీగా సంజయ్ మెహ్రోత్రా, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈవోగా నికేశ్ అరోరా, ఆరిస్టా నెట్‌వర్క్స్ సీఈవోగా జయశ్రీ ఉల్లాల్, నెట్‌యాప్ సీఈవోగా జార్జ్ కురియన్, ఫ్లెక్స్ సీఈవోగా రేవతి అద్వైతి, వీమియో సీఈవోగా అంజలి సుద్‌లు ఇప్పటికే బాధ్యతల్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరంతా భారత సంతతి వారే కావడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios