Asianet News TeluguAsianet News Telugu

అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థల సీఈవోలుగా భారతీయులు.. జాబితా ఇదే

అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు భారతీయులు నేతృత్వం వహిస్తున్నారు. పెద్ద పెద్ద సంస్థలకు చాలా మంది భారతీయులే సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పరాగ్ అగ్రావాల్ కూడా చేరారు. ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ నిన్న రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చింది. అదే రోజు కంపెనీ బోర్డు సభ్యులు పరాగ్ అగ్రావాల్‌ను సీఈవోగా నియమించారు. ఇతర ప్రసిద్ధ సంస్థలకు సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న భారతీయుల వివరాలు చూద్దాం.

Indian CEOs for top global companies.. check out details
Author
New Delhi, First Published Nov 30, 2021, 12:45 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: భారతీయులు అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్నారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు నేతృత్వం వహిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో పరాగ్ అగ్రావాల్ కూడా చేరారు. ఈ నెల 29వ తేదీన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సీఈవోగా ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చింది. అదే రోజు కంపెనీ బోర్డు సభ్యులు భారత దేశానికి చెందిన పరాగ్ అగ్రావాల్‌ను ట్విట్టర్ సీఈవోగా ఎన్నుకుంది.

బాంబే ఐఐటీలో చదువుకున్న పరాగ్ అగ్రావాల్ ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. పరాగ్ అగ్రావాల్ 2011లో ట్విట్టర్ సంస్థలో చేరారు. 2017లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ట్విట్టర్ సంస్థలో చేరక ముందు పరాగ్ అగ్రావాల్ యాహూ, మైక్రోసాఫ్ట్, ఏటీఅండ్‌టీ ల్యాబ్స్‌లో సేవలు అందించారు. 2006 నుంచి 2010 వరకు ఆయన రీసెర్చ్ టీమ్స్‌తో కలిసి పని చేశారు. అగ్రావాల్ బీటెక్ డిగ్రీ పట్టా పొందారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీర్స్ చేశారు. అనంతరం కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ట్విట్టర్‌ అనూహ్యంగా అభివృద్ధి చెందడంలో (సాంకేతికపరంగా) పరాగ్ అగ్రావాల్ టెక్నికల్ స్ట్రాటజీ కీలకంగా ఉన్నది. ఆయనను ట్విట్టర్ సీఈవోగా ఎన్నుకోవడంపై పరాగ్ అగ్రావాల్ హర్షం వ్యక్తం చేశారు.

Also Read: ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ రాజీనామా.. బాధ్యతల్లోకి భారత సంతతి పరాగ్ అగ్రావాల్

దీంతో భారతీయులు మరో దిగ్గజ సంస్థకు నేతృత్వాన్ని అందిపుచ్చుకున్నట్టయింది. ఇది వరకే చాలా మంది భారతీయులు దిగ్గజ సంస్థలకు సీఈవోగా బాధ్యతలు చేపడుతున్నారు. అందులో సుందర్ పిచయ్, సత్య నాదెళ్ల సహా మరెందరో పలు టాప్ కంపెనీలకు సీఈవోలుగా బాధ్యతలు చేపడుతున్నారు. దిగ్గజ సంస్థలకు నేతృత్వం వహిస్తున్న భారతీయుల జాబితా ఇలా ఉన్నది.

పరాగ్ అగ్రావాల్.. ట్విట్టర్ :
37ఏళ్ల పరాగ్ అగ్రావాల్ 2011లో ట్విట్టర్ సంస్థలో చేరారు. నిన్న ఈ సంస్థ సీఈవోగా మారారు.

సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ :
2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా స్టీవ్ బాల్మర్ నుంచి హైదరాబాద్‌లో జన్మించిన సత్య నాదెళ్ల బాధ్యతలు తీసుకున్నారు. అదే ఏడాది ఆయన ఆ కంపెనీ చైర్మన్‌గానూ ఎదిగారు.

సుందర్ పిచయ్.. ఆల్ఫాబెట్ :
మదురైలో జన్మించిన సుందర్ పిచయ్ గూగుల్ సీఈవోగా 2015లో నియమితులయ్యారు. 2004లో ఆయన ఆ కంపెనీలో చేరారు.

శాంతాను నారాయణ్.. అడాబ్ :
2007లో శాంతాను నారాయణ్ అడాబ్ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. దానికి ముందు ఆయన రెండేళ్లు అడాబ్ కంపెనీ సీవోవోగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లో జన్మించిన శాంతాను నారాయణ్ ఇక్కడే డిగ్రీ పట్టా పొందారు. 1998లో ఆయన అడాబ్ కంపెనీలో చేరారు.

అరవింద్ క్రిష్ణ.. ఐబీఎం :
ఐఐటీలో చదువుకున్న అరవింద్ క్రిష్ణ 2020లో ఐబీఎం సీఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ కంపెనీలో చేరిన 30 ఏళ్లకు ఈ బాధ్యతలు చేపట్టారు. 2021లో ఆయన కంపెనీ చైర్మన్‌గానూ మారారు.

సంజయ్ మెహ్రోత్రా.. మైక్రాన్ టెక్నాలజీ :
సాన్‌డిస్క్ సహ వ్యవస్థాపకుడు సంజయ్ మెహ్రోత్రా 2017 నుంచి మైక్రాన్ టెక్నాలజీ సంస్థకు సీఈవోగా సేవలు అందిస్తున్నారు. అంతకు ముందు ఆయన సాన్ డిస్క్ సంస్థకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సాన్ డిస్క్‌ను వెస్ట్రన్ డిజిటల్ కొనుగోలు చేసే వరకు ఆయనే ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

నికేశ్ అరోరా.. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ :
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకున్న నికేశ్ అరోరా 2018లో పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈవోగా ఎంపికయ్యారు. ఆయన అంతుకు ముందు గూగుల్, సాఫ్ట్ బ్యాంక్‌లలో పని చేశారు.

జయశ్రీ ఉల్లాల్.. ఆరిస్టా నెట్‌వర్క్స్ :

2008 నుంచి జయశ్రీ ఉల్లాల్ అరిస్టా నెట్‌వర్క్స్ సీఈవోగా బాధ్యతల్లో ఉన్నారు. అంతకు ముందు ఆమె ఏఎండీ, సిస్కో కంపెనీల్లోనూ సేవలు అందించారు.

జార్జ్ కురియన్.. నెట్‌యాప్ :

ప్రిన్స్‌టన్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల్లో చదువుకున్న జార్జ్ కురియన్ డేటా స్టోరేజీ కంపెనీ నెట్‌యాప్ సంస్థకు 2015లో సీఈవోగా పదోన్నతి పొందారు. అంతేకాదు, ప్రెసిడెంట్‌గానూ బాధ్యతలు తీసుకున్నారు.

రేవతి అద్వైతి.. ఫ్లెక్స్ :

బిట్స్ పిలానీలో చదువుకున్న రేవతి అద్వైతి ఫ్లెక్స్ సంస్థకు సీఈవోగా నియమితులయ్యారు. 2019లో ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఫ్లెక్స్ సంస్థ అమెరికన్ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు.

అంజలి సుద్.. వీమియో :

2017లో వీమియో సంస్థ సీఈవోగా అంజలి సుద్ నియమితులయ్యారు. ఆమె 2014లో ఈ కంపెనీలో చేరారు. హార్వార్డ్ బిజినెస్ స్కూల్, వార్టన్ స్కూల్ యూనివర్సిటీలోనూ ఆమె చదువుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios