వారిస్ పంజాబ్ దీ చీఫ్, ఖలిస్తానీ లీడర్ అమృత్‌పాల్ సింగ్ పోలీసుల కళ్లుగప్పి పారిపోయి నెల రోజులు దాటింది. అయినా.. ఆయన ఆచూకీ మాత్రం ఇంకా కనిపించలేదు. మార్చి 18వ తేదీన పంజాబ్ పోలీసులు పకడ్బందీగా ఆయనను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన చాకచక్యంగా తప్పించుకున్నారు. కార్లు మారుస్తూ.. వేషం మారుస్తూ అందరు కళ్లుగప్పారు. మార్చి 29న ఓ వీడియో విడుదల చేసి తాను సురక్షితంగా ఉన్నారని చెప్పారు. 

న్యూఢిల్లీ: ఖలిస్తాన్ లీడర్ అమృత్‌పాల్ సింగ్ పరారై 32 రోజులు గడిచింది. కానీ, పోలీసులకు ఇంకా చిక్కలేదు. ఇప్పటికీ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, అమృత్‌పాల్ సింగ్ మాత్రం చిక్కడం లేదు. నేపాల్ సరిహద్దుల్లోనూ ఆయనను వెతికారు. ఫలితం రాలేదు. బహుశా ఆయన పంజాబ్ - హర్యానా, పంజాబ్- రాజస్తాన్ సరిహద్దుల్లో మారుమూల పల్లెటూరిలో ఉండి ఉంటారని కొందరు పోలీసులు అనుమానిస్తున్నారు.

వారిస్ పంజాబ్ దీ చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకోవడానికి మార్చి 18వ తేదీన ఆపరేషన్ ప్రారంభించారు. ఇంటర్నెట్ సేవలు పాక్షికంగా నిలిపేశారు. పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు రాష్ట్రమంతటా తిరిగాయి. ఎందరో మంది ఆయన మద్దతుదారులను, సానుభూతిపరులను అరెస్టు చేశారు. కానీ, అమృత్‌పాల్ సింగ్ ఆచూకీ మాత్రం పట్టుకోలేకపోయారు. ఇదిలా ఉండగా మార్చి 29వ తేదీన ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తాను పోలీసుల వలయం నుంచి తప్పించుకున్నారని, తాను సురక్షితంగా ఉన్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఆయన పరారీకి సంబంధించి ఆ తర్వాత బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజీ వీడియోలు, ఫొటోలు చర్చనీయాంశం అయ్యాయి. ఒక్కో ఫొటోలో ఒక్కో అవతారంలో ఉన్నాడు. వాహనాలు మార్చుతూ.. డ్రెస్‌లూ మార్చుతూ గుర్తుపట్టకుండా మార్చుకున్నాడు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీలోని ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో ఆయన కనిపించిన ఫొటోలు, వీడియోలు వచ్చాయి.

హార్డ్‌లైన్ ఖలిస్తానీగా ఆయనకు ఉన్న గుర్తింపు మాత్రం ఈ పరారీతో కొంత చెదిరిపోతుందని తెలుస్తున్నది. గతంలో తాను ఎన్నడూ పోలీసులకు భయపడబోనని, ఎక్కడికి పారిపోనని అనుచరులకు తరుచూ చెప్పేవారు. తన మద్దతుదారులను ఒంటరి చేయబోనని స్పష్టం చేశారు. కానీ, పంజాబ్ పోలీసుల సెర్చ్ నుంచి ఆయన తప్పించుకున్న తీరు మద్దతుదారుల్లో ఒక రకమైన నిరాశను నింపినట్టు కొందరు స్థానికులు చెబుతున్నారు. 

కాగా, ఒక నెల రోజులుగా అమృత్‌పాల్ సింగ్ గురించి మీడియాలో వస్తున్న కథనాలు అన్నీ ముందుగానే స్క్రిప్ట్ చేసుకున్నట్టుగా ఉన్నాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు. లోతైన రాజకీయ పరిణామాలతో రాసిన కథనాలు అవి అని పేర్కొంటున్నారు.

Also Read: హెల్మెట్ ఎక్కడుంది? పోలీసులను బైక్ పై వెంటాడిన ఇద్దరు మహిళలు.. వీడియో వైరల్

పంజాబ్ పోలీసులు ఆయనపై ఫోకస్ ఫిబ్రవరి నుంచి మొదలైంది. అమృత్‌సర్‌లోని అజ్నాలా పోలీసు స్టేషన్‌కు అమృత్‌పాల్ సింగ్ వెళ్లడం దీనికి ఆరంభం అనుకోవచ్చు. తన అనుచరుడు లవ్ ప్రీత్‌ను విడుదల చేయాలని చాలా మందితో కలిసి వెళ్లాడు. అక్కడ ఆయన అనుచరులు పోలీసులపై దాడి చేశారు. గురు గ్రంథ్ సాహిబ్‌ను వెంట తీసుకెళ్లుతూ సుమారు 600 మంది పోలీసులను వేయికి పైగా అమృత్‌పాల్ సింగ్ అనుచరులు సునాయసంగా దాటుకుని వెళ్లిపోయారు. ఒక్క పోలీసు కూడా వారిపై దాడి చేసే సాహసం చేయలేదు.

అమృత్‌పాల్ సింగ్ పరారీ తర్వాత ఆయన అనుచరులు చాలా మందిని అరెస్టు చేసి దేశ భద్రత చట్టం (ఎన్ఎస్ఏ యాక్ట్) కింద అరెస్టులు చేశారు. 

అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకోకపోవడం పంజాబ్ పోలీసులకు పరాభవంగా మారింది.