Asianet News TeluguAsianet News Telugu

Omicron: అదనపు టీకాలు వేయడంపై రెండు వారాల్లో కీలక ప్రకటన.. ‘కొత్త వేరియంట్ వివరాలు రానివ్వండి’

కరోనా వైరస్ నూతన వేరియంట్ ఒమిక్రాన్ భయాలు వెలువడుతున్న తరుణంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పంపిణీ అవుతున్న టీకా సామర్థ్యంపైనా ప్రశ్నలు వచ్చాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను సవాల్ చేయగలదని ఇప్పటికే కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా అదనపు టీకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త వేరియంట్ గురించి సమాచారం ఇంకా రాలేదని, ఇంకా కొంత సమయం వేచి చూస్తే సమాచారం అందుతుందనీ అన్నారు.
 

amid omicron tensions senior official nk arora comments
Author
New Delhi, First Published Nov 29, 2021, 5:54 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. డెల్టా వేరియంట్ కంటే కూడా ఎక్కువ మ్యూటేషన్లు ఈ వేరియంట్‌లో కనిపిస్తున్నాయని, కాబట్టి, రోగ నిరోధక(Immunity) శక్తి నుంచి టీకా శక్తి నుంచి తప్పించుకునే ప్రమాదం ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌లు మన దేహంలో దాని స్పైక్ ప్రోటీన్(బయటకు కొమ్ములా ఉండేవి)తోనే అంటుకుని వ్యాపిస్తాయి. ఈ స్పైక్ ప్రోటీన్ ఎంత బలంగా ఉంటే మన అవయవాలను ఆ వైరస్ అంత గట్టిగా పట్టుకుని వేలాడుతుంది. సాధారణంగా మ్యుటేషన్లలో ఈ స్పైక్ ప్రోటీన్ ఎంత బలడింది అన్నదే చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఒమిక్రాన్‌లో అధిక మ్యుటేషన్లు ఉన్నాయని తేలడం ఆందోళనలు కలిగిస్తున్నది. ఇదే సందర్భంలో చాలా మంది నిపుణులు టీకా సామర్థ్యాలనూ ఈ వేరియంట్ సవాల్ చేయవచ్చనే అభిప్రాయాలు చెబుతున్నారు. 

టీకా తయారీదారు మొడెర్నా‌కు చెందిన సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఒమిక్రాన్ వేరియంట్‌ను నిలువరించలేవని, ఆ శక్తి ఈ టీకాల(Vaccines)కు లేవనే అభిప్రాయాన్ని స్థూలంగా వెల్లడించారు. ఈ తరుణంలోనే భారత ప్రభుత్వ ప్యానెల్ చీఫ్ కీలక ప్రకటన చేశారు. కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా అదనపు టీకాలు, బూస్టర్ టీకాలు, చిన్నపిల్లకు వ్యాక్సినేషన్‌పై కీలక విషయాలు వెల్లడించారు. 

Also Read: Omicron: వేగంగా దేశాలు దాటుతున్న వేరియంట్.. ఆపడం సాధ్యమేనా? ఏయే దేశాలకు చేరిందంటే?

అదనపు టీకాలు, బూస్టర్ డోసుల పంపిణీకి సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికతో నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ మరో రెండు వారాల్లో ముందుకు వస్తున్నదని డాక్టర్ ఎన్‌కే అరోరా వెల్లడించారు. ఈ పాలసీలోనే ఎవరు టీకాలకు అర్హులని, ఎప్పుడు.. ఎలా టీకాలు అందించబోతున్నామనే విషయాలూ ఉంటాయని వివరించారు. కొత్త వేరియంట్ కలకలం రేపుతున్నదని, ఈ కోణంలోనే నూతన పాలసీని చూడాలని సూచించారు. మరికొంత సమయం వేచి చూస్తేనే కొత్త వేరియంట్‌పై సమాచారం వస్తుందని, అంతేకాదు, మరికొంత కాలం గడిస్తేనే ఈ వేరియంట్‌పై ప్రస్తుత టీకాల పనితీరూ వెల్లడి అవుతుందని అన్నారు.

ఇదే సందర్భంగా ఆయన అదనపు డోసులు, బూస్టర్ డోసులకు మధ్య వ్యత్యాసాన్ని తెలిపారు. తొలి రెండు డోసులు అయిపోయాక నిర్దేశిత గడువులో ఇచ్చేది బూస్టర్ డోసు అని డాక్టర్ ఎన్‌కే అరోరా వివరించారు. అయితే, అదనపు డోసుకు దీనికి తేడా ఉన్నదని, రెండు డోసులు వేసిన తర్వాత ఒక వ్యక్తిలో రోగ నిరోధక శక్తి సామర్థ్యం ఆధారంగా అదనపు డోసు వేస్తారని తెలిపారు. రెండు డోసులు వేసిన తర్వాత కూడా ఒక వ్యక్తిలో రోగ నిరోధక శక్తి ఆశించిన మేర స్పందించట్లేదని తేలితే అలాంటి వారికి అదనపు డోసులు ఇస్తారని చెప్పారు.

Also Read: Omicron: డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ప్రమాదకరమా?.. అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుందంటే..

పిల్లలకు టీకా పంపిణీపైనా ఆయన కీలక విషయం వెల్లడించారు. పిల్లలే తమ అత్యున్న ఆస్తులని ఇది వరకే తాను చెప్పారని డాక్టర్ ఎన్‌కే అరోరా గుర్తు చేశారు. పిల్లలకు టీకాలు వేయడానికి ఒక సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. సుమారు 44 కోట్ల చిన్నారులకు టీకా వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. 18ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ఈ ప్రణాళిక వర్తిస్తుందని వివరించారు. త్వరలోనే దీన్ని ప్రకటిస్తామని తెలిపారు. పిల్లలకు సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయని, అందులో సంశయాలేమీ వలదని అన్నారు. జైకోవ్ డీ, కొవాగ్జిన్, కొర్బెవాక్స్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌లూ ఉన్నాయని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios