ఓ అమెరికన్ మహిళ ఇండియాకు వచ్చింది. తన ప్రేమికుడితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో చేతిలో డబ్బులు అయిపోయాయి. తల్లిదండ్రుల నుంచి డబ్బులు రాబట్టుకునేందుకు దారుణానికి తెగించింది.
న్యూఢిల్లీ : ఓ విదేశీ మహిళ భారత్ లో తాను కిడ్నాప్ కు గురయ్యానని, తనకు తెలిసిన వ్యక్తే తనను హింసిస్తున్నాడంటూ అమెరికాలోని తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అయితే, అది ఫేక్ కిడ్నాప్ అని తెలియడంతో ఆమె మీదే భారత్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెడితే.. భారత్ లో ఉంటున్న 27 ఏళ్ల అమెరికా పౌరురాలు తన తల్లిదండ్రుల నుంచి డబ్బులు తెప్పించుకునేందుకు ఎత్తుగడ వేసింది. ఈ నేపథ్యంలోనే తన స్వీయకిడ్నాప్‌కు పాల్పడిందని పోలీసులు ఆదివారం తెలిపారు. క్లోయ్ మెక్లాఫ్లిన్ అనే మహిళ మే 3న ఢిల్లీకి వచ్చిందని ఆమె అమెరికాలోని యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసిందని, వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్న ఆమె తండ్రి మాజీ ఆర్మీ అధికారి అని పోలీసులు తెలిపారు.
జులై 7న మెక్లాఫ్లిన్ తన తల్లికి ఫోన్ చేసి, తాను అసురక్షిత వాతావరణంలో ఉన్నానని, తనకు తెలిసిన వ్యక్తి తనపై దాడి చేసి కొట్టాడని చెప్పింది. అయితే, ఆమె ఎక్కడుందో లొకేషన్ మాత్రం తెలుపలేదు. ఇది విన్న తల్లి వెంటనే భారతదేశంలోని అధికారులను సంప్రదించింది. US ఎంబసీ ఈ విషయాన్ని న్యూఢిల్లీ పోలీసులకు సమాచారం పంపించింది.
బాధితురాలు భారత్‌కు వచ్చి రెండున్నర నెలలు అవుతోంది. ఇప్పుడు ఈ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. కాగా, జూలై 10న, మెక్లాఫ్లిన్ మళ్లీ తన తల్లితో వాట్సాప్ వీడియో కాల్ లో మాట్లాడింది. ఈ సమయంలో ఆమె తల్లి ఆమె గురించి మరిన్ని వివరాలు అడిగే లోపే ఒక వ్యక్తి ఆమె ఉన్న గదిలోకి ప్రవేశించాడు. దీంతో వీడియో కాల్ కట్ చేయబడిందని పోలీసులు తెలిపారు.
మొదట యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ.. సదరు మహిళ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండొచ్చని.. కుటుంబాన్ని లేదా రాయబార కార్యాలయాన్ని సంప్రదించకుండా ఆమెను ఎవరో నిరోధిస్తున్నారని ఊహించినట్లు న్యూ ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమృత గుగులోత్ తెలిపారు. అయితే ఆమె ఆచూకీ కనిపెట్టడం కోసం తాము టెక్నికల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మెక్లాఫ్లిన్ ఇటీవల తన ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్ పనికి సంబంధించి అమెరికన్ సిటిజన్ సర్వీసెస్‌కి ఇమెయిల్ పంపడానికి ఉపయోగించిన IP అడ్రస్ కోసం Yahoo.comను సహాయం కోరినట్లు పోలీసులు తెలిపారు.
Live-in Relationship: సహజీవనం చేస్తున్న మహిళను అద్దె గదిలోనే హతమార్చాడు.. ఎందుకంటే?
బాధితురాలి ఇమ్మిగ్రేషన్ ఫారమ్‌ను అందించాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అభ్యర్థించినప్పుడు, యాహూ గ్రేటర్ నోయిడాలోని ఒక అడ్రస్ ను పోలీసులకు ఇచ్చారు. ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులు ఆమె బస చేసినట్లు అనుమానించిన ఒక హోటల్‌లో దాడులు నిర్వహించారు. అయితే, అక్కడ అలాంటి పేరుతో ఎవరూ తమ హోటల్‌లో లేరని, గత కొంతకాలంగా ఎవరూ రాలేదని అక్కడి సిబ్బంది తెలిపారు.
మరోవైపు మెక్లాఫ్లిన్ తన తల్లికి వీడియో కాల్ చేసినప్పుడు..ఉపయోగించిన వైఫైని ఇన్వేస్టిగేటర్స్ కనిపెట్టారని, ఆమె వేరేవారి వైఫే వాడుతుందని తేలిందని గుగులోత్ చెప్పారు. "ఈ మేరకు మా బృందం IP చిరునామాతో అనుబంధించబడిన మొబైల్ నెట్‌వర్క్‌ను ట్రాక్ చేసింది. అది గురుగ్రామ్‌లోని ఒక నైజీరియన్ జాతీయుడైన ఒకోరోఫోర్ చిబుయికే ఒకోరో (31)ది అని తేలింది. అతడిని ప్రశ్నిస్తే మహిళ గ్రేటర్ నోయిడాలో ఉంటోందని పోలీసులకు చెప్పాడు.
అతని ఇన్‌పుట్‌ను అనుసరించి, పోలీసులు మెక్లాఫ్లిన్‌ను ట్రాక్ చేసి అరెస్టు చేశారు. ఆ తరువాత మెక్లాఫ్లిన్ ను విచారించగా, ఢిల్లీకి చేరిన కొద్ది రోజుల్లోనే తన వద్ద డబ్బులు అయిపోయాయని.. అందుకే తాను కిడ్నాప్ కు గురయ్యానని డ్రామా ఆడినట్లు ఒప్పుకుంది, ఆ తర్వాత ఆమె, ఆమె ప్రియుడు ఒకోరో కలిసి ఆమె తల్లిదండ్రుల నుండి డబ్బు వసూలు చేయడానికి పథకం పన్నారని DCP చెప్పారు.
మహిళ పాస్‌పోర్ట్ గడువు జూన్ 6తో ముగిసిందని, ఆమె ప్రియుడి పాస్‌పోర్టు గడువు కూడా అయిపోయిందని పోలీసులు తెలిపారు. ఇక్కడికి రాకముందు వీరిద్దరినీ ఫేస్‌బుక్‌లో స్నేహం కుదిరింది. వీరిద్దరూ సహజీవనం చేయడం కోసం భారతదేశానికి వచ్చారు. ఇద్దరూ ఇక్కడ సహజీవనం చేస్తూ పాటలపై మక్కువ పెంచుకున్నారు. పాటల మీదున్న అభిరుచే వీరిద్దరినీ స్నేహితులుగా మార్చిందని పోలీసు అధికారి తెలిపారు.
పాస్ పోర్ట్, వీసా గడువు ముగిసినా ఇంకా భారతదేశంలో ఉన్నందుకు వీరిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
