Asianet News TeluguAsianet News Telugu

జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు అలహాబాద్ హైకోర్ట్ అనుమతి.. జూలై 31 వరకు డెడ్‌లైన్

వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు అలహాబాద్ హైకోర్ట్ అనుమతి మంజూరు చేసింది. జూలై 31 లోగా సర్వే పూర్తి చేయాలని న్యాయస్థానం డెడ్ లైన్ విధించింది.

Allahabad High Court directs ASI to complete survey by July 31 at Gyanvapi Mosque ksp
Author
First Published Jul 26, 2023, 5:27 PM IST

వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు అలహాబాద్ హైకోర్ట్ అనుమతి మంజూరు చేసింది. జూలై 31 లోగా సర్వే పూర్తి చేయాలని న్యాయస్థానం డెడ్ లైన్ విధించింది. అలాగే కట్టడానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా సర్వే చేయాలని పేర్కొంది. కాగా.. జ్ఞానవాపి మసీదును ఓ ఆలయంపై నిర్మించారా అనే విషయంపై సర్వే నిర్వహించాలంటూ ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ను జిల్లా కోర్ట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అంజుమన్ ఇంతెజామియా మస్జీద్ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రీతింకర్ దివాకర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వేకు అనుమతించింది. 

అసలు వివాదమేమిటీ? 

జ్ఞానవాపిలో 100 అడుగుల ఎత్తైన ఆది విశ్వేశ్వరుని స్వీయ-వ్యక్త జ్యోతిర్లింగం ఉందని హిందూ పక్షం పేర్కొంది. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని మహారాజా విక్రమాదిత్యుడు సుమారు 2050 సంవత్సరాల క్రితం నిర్మించాడు. అయితే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1664 సంవత్సరంలో ఈ ఆలయాన్ని కూల్చివేశాడు. ఈ స్థలంలోనే ప్రస్తుతం ఉన్న జ్ఞానవాపి మసీదు నిర్మించబడిందని వాదన.

Also Read: జ్ఞాన్‌వాపీ కేసులో కీలక పరిమాణం.. ఇంతకీ అసలు వివాదమేమిటీ? వివాదం ఎప్పుడు ప్రారంభమైందంటే..?

జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లో పురావస్తు సర్వే నిర్వహించి భూగర్భంలో ఉన్నది ఆలయ అవశేషాలా కాదా అని తేల్చాలని పిటిషనర్లు కోరారు. వివాదాస్పద కట్టడాన్ని కూల్చడమే కాకుండా.. 100 అడుగుల ఎత్తైన జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేసి.. మసీదు నిర్మాణంలో ఉపయోగించారనేది హిందూ పక్షం వాదన. మసీదు గోడలను కూడా పరిశీలించి అవి ఆలయానికి చెందినవా? కాదా? అని తెలుసుకోవాలి. జ్ఞానవాపి మసీదు కాశీ విశ్వనాథ ఆలయ అవశేషాల నుండి నిర్మించబడిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వాదనలను విన్న న్యాయస్థానం ఓ కమిటీని నియమించింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందాన్ని జ్ఞాన్వాపీ క్యాంపస్‌లో సర్వే చేయాలని కోరారు.  

Follow Us:
Download App:
  • android
  • ios