ముంబై: పార్టీపై, సొంత బాబాయిపై తిరుగుబాటు చేసి.. తిరిగి సొంత గూటికి చేరుకున్న ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌ ను వివాదాలు ఇప్పుడప్పుడు వదిలేలా లేవు. తాజాగా కూడా ఆయన మరో గందరగోళ పరిస్థితి సృష్టించాడు.  

ఎన్సీపీకి ఎదురుతిరిగి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన అజిత్, తన వర్గం ఎమ్మెల్యేలు  కలిసిరాకపోవడంతో, పవార్‌ కుటుంబసభ్యులు ఒత్తిడి తేవడంతో తిరిగి సొంత గూటికే చేరారు. చేసిన తప్పు ఒప్పుకున్నారు. మళ్లీ సొంతగూటికి చేరిన అబ్బాయిని బాబాయ్‌ శరద్‌ పవార్‌ కూడా క్షమించారు, గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పారు.  

Also read: ఉద్ధవ్ ప్రమాణానికి మోడీకి ఆహ్వానం... ఆసక్తికరంగా గెస్ట్ లిస్ట్

ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో​ అజిత్‌ ఏమేరకు సర్దుకుపోతారన్నది ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఆయన సీఎం పదవిపై కన్నేసినట్టు వార్తలు వస్తుండటంతో మరోమారు ఏమవుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

 పొత్తుల్లో భాగంగా రెండున్నరేళ్లపాటు సీఎం పదవిని ఎన్సీపీ అడిగితే తప్పేంటని  ఎన్సీపీ ఎమ్మెల్యేల సమావేశంలో అజిత్‌ కామెంట్‌ చేసినట్టు ఎన్సీపీలోని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.  

ఈ పరిస్థితుల మధ్య ఉన్నట్టుండి అజిత్‌ పవార్‌ ఫోన్‌ స్విచ్ఛాప్‌ కావడంతో ఒక్కసారిగా మూడు పార్టీల్లోనూ ఆందోళన మొదలయ్యింది. ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారానికి  సిద్ధమైన వేళ, అజిత్‌ ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసుకోవడం పలు ఊహాగానాలకు తెరతీసినట్టయ్యింది.  

Also read: ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్నది వీరే...

అయితే, ఈ వ్యవహారంపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ స్పందిస్తూ, అజిత్‌ ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నారని, సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరు కానున్నారని తెలిపారు. కాల్స్‌ ఎక్కువగా వస్తుండటంతో ఫోన్‌ స్విచ్చాప్‌ చేశారని క్లారిటీ ఇచ్చారు. 

మరోవైపు అజిత్‌ సొంత నియోజకవర్గమైన బారామతిలో వెలిసిన పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భావి ముఖ్యమంత్రి అజిత్‌ పవారేనంటూ ఆయన మద్దతుదారులు బారామతిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పోస్టర్లు వేయడం గమనార్హం.

ఏకంగా ట్విట్టర్లో కూడా అజిత్ ఫర్ సీఎం అనే హాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతూ, టాప్ 5 లో ఉంది. మరోవైపు ఉద్ధవ్‌ సర్కార్‌లో కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి అజిత్‌కు దక్కవచ్చునని వినిపిస్తోంది. నేటి ప్రమాణస్వీకార మహోత్సవంలో అజిత్ పవార్ ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి ప్రమాణస్వీకారం చేయడంలేదు.