ఐశ్వర్యరాయ్ కూతురుకు పీఎం అయ్యే యోగం
ముంబై: అమితాబ్ మనమరాలు, ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యకు మంచి భవిష్యత్తు ఉందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జ్ఞానేశ్వర్ చెప్పారు.
ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జ్ఞానేశ్వర్ ఆదివారం నాడు హైద్రాబాద్ మీడియాతో మాట్లాడారు. 2018 సంవత్సరానికి గాను పలువురి జాతకాలను ఆయన వివరించారు. ప్రముఖ నటులు రజనీకాంత్, చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని ఆయన గతంలో ప్రకటించారు. ఆయన ప్రకటించినట్టుగానే రజనీకాంత్ కూడ రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలోని అన్ని సీట్లలో పోటీ చేస్తానని ప్రకటించారు.
మరో వైపు తెలుగు సినీ నటుడు చిరంజీవి కూడ రాజకీయాల్లోకి వస్తారని ఆయన గతంలో చెప్పారు. జ్ఞానేశ్వర్ చెప్పినట్టుగానే చిరంజీవి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. అంతేకాదు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009లో అధికారంలోకి వచ్చింది.
ఐశ్యర్యరాయ్ కూతురు ఆరాధ్య పేరును రోహిణిగా మార్చాలని ఆయన సూచించారు. ఆరాధ్యకు మంచి భవిష్యత్తు ఉందని ఆయన చెప్పారు. అంతేకాదు ఆరాధ్య దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడ ఉన్నాయని జ్ఞానేశ్వర్ చెప్పారు.
నరేంద్రమోడీ తిరిగి దేశ ప్రధానిగా ఎన్నిక అవుతారని ఆయన చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకొంటారని ఆయన ప్రకటించారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో రజనీకాంత్ ఏర్పాటు చేయబోయే పార్టీ విజయఢంకా మోగించనుందని ఆయన ప్రకటించారు.
అంతేకాదు తమిళనాడు సీఎంగా రజనీకాంత్ ప్రమాణం చేయనున్నారని ఆయన చెప్పారు.అంతేకాదు తమిళనాడులో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లోనే రజనీకాంత్ పార్టీ ఘన విజయం సాధిస్తోందని ఆయన తెలిపారు.
2024లో పాకిస్థాన్, భారత్‌ల మధ్య యుద్దం వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.రిలయన్స్ ఛైర్మెన్ అంబానీ కొడుకు ఆకాష్ 2019లో వివాహం చేసుకొంటారని ఆయన చెప్పారు.
