ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదానికి సంబంధించి AAIB ప్రాథమిక నివేదిక బైటకు వచ్చింది. ఈ క్రమంలో ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన కీలకమైన 10 విషయాలను తెలుసుకుందాం.
Ahmedabad plane Crash : ఎయిర్ ఇండియా AI171 విమానం దుర్ఘటన జరిగిన నెలరోజుల తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఒక ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే జరిగిన కొన్ని సంఘటనలు 260 మంది ప్రాణాలను ఎలా బలితీసుకున్నాయో ఈ నివేదిక బైటపెట్టింది. ఈ నివేదిక కేవలం సాంకేతిక వైఫల్యాలను మాత్రమే కాకుండా కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న గందరగోళం, పైలట్ల నిస్సహాయతను కూడా తెలియజేసింది. ఎయిరిండియా పైలట్లు పరిస్థితిని అర్థం చేసుకునేలోపే విమానం కుప్పకూలిపోయిందని అర్థమవుతోంది.
లండన్ వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ జూన్ 12న అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే అది బిజె మెడికల్ కాలేజీ సమీపంలోని స్టూడెంట్స్ హాస్టల్ కాంప్లెక్స్‌లో కూలిపోయింది. విమానంలో ఉన్న 241 మందిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
తాజా నివేదికలోని 10 కీలక అంశాలు ఉన్నాయి. ఇవి కేవలం సాంకేతిక అంశాలు మాత్రమే కాదు చివరి క్షణాల్లో ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
1. గాల్లో ఇంజన్లు ఆగిపోయాయి:
విమానం గాల్లోకి లేవగానే విపత్తు సంభవించింది. మూడు సెకన్లలో రెండు ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది. వేగం, ఎత్తు చాలా కీలకమైన సమయంలో ఇంజన్లు ఆగిపోయాయి. ఇది అకస్మాత్తుగా జరిగింది.. పైలట్లు ఏం చేయలేకపోయారు.
2. 'నువ్వెందుకు ఆపేశావు?' కాక్‌పిట్ గందరగోళం:
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లోని అత్యంత కీలకమైన పైలట్ల సంభాషణ రికార్డ్ అయ్యింది. ఒక పైలట్ మరొకరిని "నువ్వెందుకు ఆపేశావు?" అని అడుగుతున్నట్లు వినిపిస్తుంది. మరొకరు "నేను ఆపలేదు" అని సమాధానం ఇచ్చారు. అంటే ఇంజన్లు ఎందుకు ఆగిపోయాయో ఎవరికీ తెలియదు.
3. విమానం ఆటోమెటిక్ వ్యవస్థలు ఆన్…
విమానంలో ఆటోమెటిక్ వ్యవస్థలు పనిచేయడం ప్రారంభించాయి. ఈ క్రమలో మొదటి ఇంజన్ పునఃప్రారంభమయ్యింంది…. కానీ రెండో ఇంజన్ మళ్లీ పనిచేయలేదు. విమానం పైకి ఎగరడానికి ప్రయత్నించినా రెండు ఇంజన్ల నుండి థ్రస్ట్ లేకపోవడంతో ప్రమాదం జరిగింది.
4. అత్యవసర విద్యుత్ వినియోగం
ఇంజన్లు ఆగిపోయిన వెంటనే రామ్ ఎయిర్ టర్బైన్ (RAT), విద్యుత్ కోసం చివరి రిసార్ట్ బ్యాకప్ అమలు చేయబడింది. దీంతో కీలక వ్యవస్థలు విఫలమయ్యాయని స్పష్టమయ్యింది. ఇది అ పరిస్థితి విషమంగా ఉందని నిర్ధారిస్తుంది.
5. 'మేడే, మేడే, మేడే' - సహాయం కోసం చివరి పిలుపు:
08:09:05 UTCకి పైలట్లలో ఒకరు ప్రమాదాన్ని తెలియజేసారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రతిస్పందించడానికి ప్రయత్నించినప్పుడు, ఎటువంటి సమాధానం రాలేదు. కేవలం నిశ్శబ్దం. విమానం ఇప్పటికే కుప్పకూలిపోయింది. .
6. విమానం ఇలా నేలకూలింది
విశ్లేషణ ప్రకారం ప్రమాద స్థలంలో విమానం ముందుభాగంం 8-డిగ్రీలపైకి లేని కనిపిస్తుంది. అంటే పైలట్లు ప్రమాదాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారన్నమాట... కానీ థ్రస్ట్ లేకపోవడంతో విమానం పైకి ఎగరలేదు.
7. క్రాష్ తర్వాత థ్రస్ట్ లివర్లు ఎలా ఉన్నాయంటే
ముందు టేకాఫ్ కోసం సెట్ చేయబడినప్పటికీ, క్రాష్ తర్వాత థ్రస్ట్ లివర్లు ఐడిల్‌లో ఉన్నట్లు కనుగొనబడ్డాయి. ఇలా ఎందుకు జరిగిందనేది అస్పష్టంగా ఉంది.
8. విషాదకర ముగింపు
విమాన ప్రమాదం తర్వాత ఇంజన్లు, ల్యాండింగ్ గేర్, ఫ్యూజ్‌లేజ్ ముక్కలు చాలాదూరం పడివున్నాయి. అది కేవలం క్రాష్ కాలేదు పూర్తిగా విచ్ఛిన్నమైంది.
9. విమానం ఎయిర్‌వర్తీగా ఉంది
ఇది పాత లేదా లోపభూయిష్ట విమానం కాదు. దీనికి చెల్లుబాటు అయ్యే ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేట్ ఉంది. దాని ఇంధన వ్యవస్థ గురించి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయబడలేదు, పైలట్లకు ఏమి జరుగుతుందో ఊహించడానికి ఎటువంటి కారణం లేదు.
10. బోయింగ్ హెచ్చరిక?
ఇంధన స్విచ్‌లకు లాకింగ్ మెకానిజమ్‌లను జోడించడం గురించి బోయింగ్ తప్పనిసరి కాని సలహాను జారీ చేసింది. కానీ ఎయిర్ ఇండియా దానిని అమలు చేయలేదు.
ఎయిర్ ఇండియా దర్యాప్తుకు సహకరిస్తున్నట్లు తెలిపింది. బోయింగ్ కూడా అంతర్జాతీయ ప్రోటోకాల్‌ను అనుసరిస్తుందని, తుది ఫలితాల కోసం వేచి ఉంటుందని పేర్కొంది.
