మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం: అసదుద్దీన్ ఓవైసీ
మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉందన్నారు.
న్యూఢిల్లీ:మహిళా రిజర్వేషన్ బిల్లును ఎంఐఎం వ్యతిరేకించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారంనాడు లోక్ సభలో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చలో పలు పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఈ చర్చలో ఎంఐఎం చీఫ్, హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ బిల్లు దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఇది ముస్లిం సమాజాన్ని మోసం చేస్తుందని ఓవైసీ విమర్శించారు.మహిళా రిజర్వేషన్ బిల్లు( నారీ శక్తి వందన్ బిల్లు) లో ముస్లిం, ఓబీసీ వర్గాల మహిళల కోటా చేర్చనందుకు బిల్లును వ్యతిరేకిస్తున్నట్టుగానే నిన్ననే ఓవైసీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ బిల్లుతో ఓబీసీ, ముస్లిం ప్రాతినిథ్యాన్ని ప్రభావితం చేస్తుందని అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు.ఈ బిల్లుతో మహిళలకు న్యాయం జరగదన్నారు.
ఓబీసీ,మహిళా వ్యతిరేక బిల్లుగా అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.
ఇప్పటివరకు 17 లోక్ సభల్లో 8992 మంది ఎంపీలుగా ఎన్నికైతే అందులో కేవలం 520 మంది మాత్రమే ముస్లింలు ఎంపీలుగా ఎన్నికైన విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ గుర్తు చేశారు. అయితే ఇందులో ముస్లిం మహిళలు కొద్ది మంది కూడ లేరన్నారు.
also read:మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయంగా వాడుకుంటున్నారు: బీజేపీపై కనిమొళి ఫైర్
మహిళా రిజర్వేషన్ బిల్లును మంగళవారంనాడు లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘావాల్ ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై ఇవాళ లోక్ సభలో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ చర్చను ప్రారంభించారు. పలు పార్టీల ఎంపీలు ఈ చర్చలో పాల్గొన్నారు. రాజ్యసభలో ఈ బిల్లుపై రేపు చర్చ జరిగే అవకాశం ఉంది.
మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకొంటుందని విపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సమయంలో డీఎంకె ఎంపీ కనిమొళి ఈ విషయమై బీజేపీపై విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయం ప్రవేశ పెట్టడానికి ముందు విపక్ష పార్టీలతో చర్చించారా అని ప్రశ్నించారు.మరోవైపు విపక్ష పార్టీల విమర్శలకు బీజేపీ సభ్యులు కూడ కౌంటరిచ్చారు. సోనియాగాంధీ చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కౌంటరిచ్చారు.