మోడీ ఎప్పటికీ ప్రధాని కాకూడదు .. అదే నా లక్ష్యం : రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఒవైసీ కీలక వ్యాఖ్యలు
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఇకపై ప్రధాని కాకూడదన్నది తన లక్ష్యమని పేర్కొన్నారు. తాము రాజస్థాన్‌లో పోటీ చేయడం ఇదే తొలిసారని.. మరి ఇన్నాళ్లు బీజేపీ ఎవరి వల్ల గెలిచిందని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఒవైసీ బ్రదర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లను సొంతం చేసుకుంది ఎంఐఎం . తాజాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మజ్లిస్ బరిలో నిలిచింది. దీంతో అభ్యర్ధుల తరపున అసదుద్దీన్ ఒవైసీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
మోడీ ఇకపై ప్రధాని కాకూడదన్నది తన లక్ష్యమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ , అశోక్ గెహ్లాట్ మద్ధతుదారులు కూడా మోడీని తమ హీరోగా చెబుతూ వుంటారని.. తీరా మేం రాజస్థాన్‌లో పోటీ చేస్తుంటే ఎంఐఎం ఓట్లు చీల్చడానికి వచ్చిందంటూ ఆరోపిస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు. తాము రాజస్థాన్‌లో పోటీ చేయడం ఇదే తొలిసారని.. మరి ఇన్నాళ్లు బీజేపీ ఎవరి వల్ల గెలిచిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ దీనికి సమాధానం చెబుతుందా అని అసదుద్దీన్ ఒవైసీ నిలదీశారు.
ALso Read: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎంఐఎం.. అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు..
అంతకుముందు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో తొలిసారిగా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎన్నికల బరిలోకి దిగుతుందని చెప్పారు. జైపూర్‌లోని హవా మహల్, సికార్‌లోని ఫతేపూర్, భరత్‌పూర్‌లోని కమాన్ నియోజకవర్గాల నుంచి ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టిందని తెలిపారు. రాష్ట్ర నాయకత్వంతో సంప్రదించి మరిన్ని పేర్లను ప్రకటిస్తామని ఒవైసీ తెలిపారు. పార్టీ తొలిసారిగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని... మా అభ్యర్థుల విజయం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం అని ఆయన పేర్కొన్నారు.
రాజస్తాన్ అసెంబ్లీ ఎంఐఎం వ్యూహం గురించి వివరిస్తూ.. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్ విఫలమైందని, అంతర్గత పోరులో ఆ పార్టీ నిమగ్నమైందని చెబుతూ ప్రజల్లోకి వెళ్తామని ఒవైసీ అన్నారు. అలాగే బీజేపీ మతతత్వ, మెజారిటీ అనుకూ ప్రవర్తనను కూడా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రాజస్తాన్‌లో తిరిగి కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోబోతోందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పడంపై ప్రశ్నించగా.. కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులు చాలా విషయాలు చెబుతున్నారని సెటైర్లు వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుస్తామని గెహ్లాట్ చెప్పారని.. కానీ ఆయన కుమారుడు ఓడిపోయారని ఎద్దేవా చేశారు.