అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం అర్థరాత్రి హిందూ కుష్ పర్వత ప్రాంతం భూప్రంకపనలతో వణికిపోయింది. యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS), నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వివరాల ప్రకారం రిక్టర్ స్కేల్‌పై 6.0–6.3 తీవ్రత నమోదైంది.
రెండు సార్లు భూకంపం
మొదటి భూకంపం రాత్రి 11:47 గంటలకు తూర్పు అఫ్గానిస్తాన్ నంగర్‌హార్ ప్రావిన్స్‌లో సంభవించింది. దీని కేంద్రం జలాలాబాద్ సమీపంలో సుమారు 8–10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. 20 నిమిషాల తర్వాత అదే ప్రావిన్స్‌లో మరోసారి 4.5 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది.
ప్రాణ నష్టం, గాయాలు
స్థానిక ప్రజారోగ్య శాఖ ప్రతినిధి నకిబుల్లా రహీమి ప్రకారం తొలుత 9 మంది మృతి చెందినట్లు ధృవీకరించారు. అయితే తర్వాత వచ్చిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య ఏకంగా 200 ఉండొచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక సుమారు 500 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
భారతదేశం, పాకిస్తాన్‌లో ప్రకంపనలు
ఈ భూకంపం ప్రభావం పాకిస్తాన్‌తో పాటు ఉత్తర భారతదేశంలోనూ కనిపించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్, జమ్ముకశ్మీర్ ప్రాంతాల్లో భవనాలు కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే అక్కడ ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
హిందూ కుష్ – భూకంపాలకు కేంద్ర బిందువు
అఫ్గానిస్తాన్‌లోని హిందూ కుష్ పర్వత శ్రేణి భూకంపాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భూగర్భ చలనం తరచుగా చోటుచేసుకుంటుంది. గతంలోనూ అనేక సార్లు శక్తివంతమైన ప్రకంపనలు ఈ ప్రాంతాన్ని వణికించాయి.
* ఆగస్టు 2, 2025: 5.5 తీవ్రత, 87 కి.మీ లోతులో భూకంపం వచ్చింది.
* ఆగస్టు 6, 2025: 4.2 తీవ్రతతో ప్రకంపనలు.
* ఏప్రిల్ 2025: 5.8 తీవ్రతతో భూకంపం, జమ్ముకశ్మీర్ వరకు ప్రభావం.
* అక్టోబర్ 2023: 6.3 తీవ్రతతో భారీ భూకంపం, పశ్చిమ అఫ్గానిస్తాన్‌లో వేలాది ప్రాణాలు కోల్పోయారు.
