ఇస్రో విజయవంతంగా ఆదిత్య ఎల్ 1 మిషన్‌ను నింగిలోకి పంపింది. ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా సెపరేట్ అయి.. ఎలిప్టికల్ ఆర్బిట్‌లోకి ప్రవేశించింది. ఈ మిషన్ భూ గ్రహ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం నుంచి బయటికి వెళ్లిన తర్వాత క్రూజ్ ఫేజ్ మొదలవుతుంది. ఇది దీర్ఘకాలం సాగుతుంది.  

న్యూఢిల్లీ: చంద్రయాన్ 3 మిషన్ విజయం ఊపు కొనసాగుతుండగానే ఇస్రో మరో ప్రయోగానికి అడుగు వేసింది. సూర్యుడి రహస్యాలను ఛేదించడానికి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1ను ఇస్రో ఈ రోజు శ్రీహరికోటలోని షార్ నుంచి నింగిలోకి పంపింది. ఏడు పే లోడ్లను పీఎస్ఎల్వీ రాకెట్ మోసుకెళ్లుతున్నది. ఈ మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించారు. ఉదయం 11.50 గంటలకు మిషన్ ప్రయోగించిన తర్వాత 55 నిమిషాల అనంతరం నాలుగో దశలో విజయవంతంగా ఇగ్నిషన్ చేశారు. ఆ తర్వాత ఆదిత్య ఎల్1 విజయవంతంగా సెపరేషన్ అయింది.. ప్రయోగం చేసిన 4,382 సెకండ్ల తర్వాత మోనోమెథైల్ హైడ్రాజిన్ పాసివేషన్ మొదలవుతుంది. ఈ కథనం రాసేసమయానికి మిషన్ అనుకున్నట్టుగానే ముందుకు సాగుతున్నది.

నాలుగు నెలల సుదీర్ఘ ప్రయాణం

ఆదిత్య ఎల్ 1 మిషన్ సుమారు నాలుగు నెలల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉన్నది. ఆదిత్య ఎల్1ను ప్రయోగించిన తర్వాత ముందుగా దాన్ని లో ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. దాన్ని ఎలిప్టికల్(దీర్ఘవృత్తాకార) ఆర్బిట్‌గా అడ్జస్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ కూడా ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. ఆదిత్య ఎల్ 1 మిషన్ విజయవంతంగా దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది.

అనంతరం, భూ గ్రహ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం నుంచి బయటికి పంపిస్తారు. లగ్రాంజ్ పాయింట్ 1 వైపుగా దాన్ని ప్రొపెల్ చేస్తారు. భూమ్యాకర్షణ శక్తి నుంచి బయటపడిన తర్వాత అది క్రూజ్ ఫేజ్‌లోకి వెళ్లుతుంది. ఈ ఫేజ్‌లోనే మిషన్ దీర్ఘ ప్రయాణం చేస్తుంది. ఆ తర్వాత లగ్రాంజ్ పాయింట్ 1 వద్ద హాలో ఆర్బిట్‌లోకి వెళ్లుతుంది. 

YouTube video player

ప్రయాణంలో కీలక దశ

ప్రముఖ ఆస్ట్రో ఫిజిసిస్ట్ సోమక్ రాయ్ చౌదురి భారత సోలార్ మిషన్ గురించి మాట్లాడుతూ.. ఇది చంద్రయాన్ ప్రయోగానికి భిన్నమైనదని, ఇక్కడ ఆదిత్య ఎల్1 మిషన్‌ను లాగి ఉంచిపట్టేదేమీ ఉండదని, పూర్తిగా ఒక ఎంప్టీ పాయింట్ వద్ద మిషన్ తిరుగుతూ ఉంటుందని వివరించారు. భూగ్రహ కక్ష్య దాటి బయటికి వెళ్లిన తర్వాత ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయాణం క్లిష్టంగా ఉంటుందని తెలిపారు. ఎందుకంటే.. ఈ ప్రయాణంలో మిషన్ 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం అంటే.. భూమి నుంచి చంద్రుడికి మధ్యనున్న దూరానికి నాలుగు రెట్లు ప్రయాణించాల్సి ఉన్నది. ఈ ప్రయాణంలో లిక్విడ్ అపోజీ మోటార్ సరైన సమయంలో, సరైన తీవ్రతతోనే వెలగాల్సి ఉంటుందని, అలాగైతేనే మిషన్ లంగ్రేజ్ పాయింట్ 1 వద్దకు వెళ్లగలుగుతుంది.

Also Read: Aditya L1 Launch: సూర్యుడి గుట్టు విప్పేందుకు.. నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్-1 (వీడియో)

మొదటి ఫొటో ఫిబ్రవరి చివరిలో..

ఆదిత్య ఎల్ 1 మిషన్ లగ్రాంజ్ పాయింట్ 1 వద్దకు వెళ్లిన తర్వాత కంటినమ్ చానల్‌లోకి వెళ్లిన తర్వాత నిమిషానికి ఒక ఫొటో తీసి మనకు పంపిస్తుంది. అంటే రోజుకు సుమారు 1,440 ఫొటోలను పంపనుందని ఆదిత్య ఎల్1 ప్రాజెక్ట్ సైంటిస్టు, వీఈఎల్సీ ఆపరేషన్ మేనేజర్ డాక్టర్ ముత్తు ప్రియాల్ తెలిపారు. జనవరి మధ్యలో మిషన్ విజవయవంతంగా లగ్రాంజ్ పాయింట్ 1‌ను చేరనుంది. ఆ హాలో ఆర్బిట్‌లోకి వెళ్లిన తర్వాత ప్రతి సిస్టమ్‌ను పరీక్షిస్తారు. ఫిబ్రవరి చివరిలో తొలి ఫొటో ఇస్రోకు అందుతుందని అంచనా వేస్తున్నారు. వీఈఎల్సీ షటర్ ఓపెన్ చేయడం చివరిదని, ఆ తర్వాత ఫిబ్రవరి మధ్య కాలంలో తొలి ఫొటో రావొచ్చని ప్రొఫెసర్ జగదేవ్ సింగ్ వివరించారు.