భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టింది.
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టింది. సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సి57 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున వీక్షకులు శ్రీహరికోటకు చేరుకున్నారు. ఇక, ఇప్పటివరకు శాస్త్రవేత్తల అంచనాల ప్రకారమే ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్తుంది. ఆదిత్య ఎల్ 1 గమనాన్ని షార్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.
ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదిత్య ఎల్-1 ద్వారా ఏడు పేలోడ్‌లను పంపుతున్నారు.
ఆదిత్య ఎల్-1 ప్రయోగం గురించి..
-సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగిస్తున్న మొదటి ఉపగ్రహం ఇదే.
-ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని భూమి నుంచి సూర్యుడి దిశలో లాగ్రేంజ్ పాయింట్-1 (ఎల్-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
-అక్కడి చేరేందుకు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహానికి దాదాపు 125 రోజుల సమయం పడుతుంది.

-ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలు ఉంటుంది.
-ఈ ఉపగ్రహం ద్వారా సౌర వ్యవస్థపై పరిశోధనలు జరపడంతో పాటు.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయాలనిఇస్రో చూస్తుంది.
-ఇందు కోసం ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్తుండగా.. ఇవి సూర్యుడి పొరలైన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొర (కరోనా), సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేయనున్నాయి. తద్వారా సౌర తుఫానులు, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు.
