New Delhi: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటర్వ్యూపై కాంగ్రెస్ ఫైర్ అయింది. అదానీ వ్య‌వ‌హారంలో దాచడానికి ఏమీ లేదా? అని బీజేపీని ప్రశ్నించింది. కాంగ్రెస్ మరోసారి జేపీసీ డిమాండ్ ను లేవనెత్తుతూ.. ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని బీజేపీని ప్రశ్నించింది.

Adani Row-Jai Ram Ramesh Counter to Amit Shah: అదానీ గ్రూప్ అంశంపై దేశంలో రాజ‌కీయ ర‌చ్చ కొన‌సాగుతోంది. అదానీ గ్రూప్ పై హిండెన్ బ‌ర్గ్ నివేదిక వెలువ‌డిన త‌ర్వాత అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటర్వ్యూపై కాంగ్రెస్ ఫైర్ అయింది. అదానీ వ్య‌వ‌హారంలో దాచడానికి ఏమీ లేదా? అని బీజేపీని ప్రశ్నించింది. కాంగ్రెస్ మరోసారి జేపీసీ డిమాండ్ ను లేవనెత్తుతూ.. బీజేపీ వాళ్లు ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ప్రశ్నించింది. 

వివ‌రాల్లోకెళ్తే.. అదానీ వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రగడ తగ్గేలా కనిపించడం లేదు. అదానీ అంశంపై బీజేపీకి దాచ‌డానికి ఏమీ లేద‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. బీజేపీకి దాచడానికి ఏమీ లేనప్పుడు జేపీసీ డిమాండ్ నుంచి ఎందుకు తప్పించుకుంటున్నారని ప్రశ్నించారు. లోక్ సభ, రాజ్యసభలో కూడా అదానీ అంశాన్ని ప్రస్తావించకుండా, అదానీ-హిండెన్ బ‌ర్గ్ నివేదిక‌పై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా ఎందుకు అడ్డుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. 

లోక్ స‌భ‌లో అదానీ అంశాన్ని రాహుల్ గాంధీ, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే లేవనెత్తినప్పుడు ఆయన నోరు మూయించే ప్రయత్నం చేశారని జైరాం రమేష్ ఆరోపించారు. అదానీ కేసును దర్యాప్తు చేయాలి. జేపీసీలో మెజారిటీ అధికార పార్టీకి చెందిన వారే ఉంటారనీ, విచారణ జరిపించాలని జేపీసీని కోరతామన్నారు. ప్రశ్నించడం ప్రతిపక్షాల ప్రజాస్వామిక హక్కు అని ఆయన అన్నారు. ఇది ఏ నియమాన్ని ఉల్లంఘించడం కాద‌ని స్ప‌ష్టం చేశారు. బడ్జెట్ సమావేశాలు వాయిదా పడటం కొత్తేమీ కాద‌నీ, ఇది గతంలోనూ జరిగింద‌ని అన్నారు. కాంగ్రెస్ హయాంలో లోక్ సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయ‌ని తెలిపారు. 

అందాని అంశంపై జేపీసీ అంటే ఎందుకు భ‌యం..?

అదాని అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో బీజేపీకి ఇబ్బంది ఏంటని జైరాం రమేష్ ప్ర‌శ్నించారు. "జేపీసీ నుంచి బీజేపీ ఎందుకు పారిపోతోంది? పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు కూడా వీలు లేదన్నారు. అదానీ విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒకే అభిప్రాయంతో ఉన్నాయని" అన్నారు. హిండెన్‌బర్గ్‌పై దర్యాప్తు చేస్తామని ప్రభుత్వం చెబుతుందనీ, అదానీపై దర్యాప్తు చేయాలని ఆయన అన్నారు. అదానీకి, ప్రధాని న‌రేంద్ర మోడీకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే దానిపై విచారణ జరగాల‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో అదానీకి ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరిందనే విషయాలన్నింటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Scroll to load tweet…

న్యూఢిల్లీ బీబీసీ ఆఫీసు ఐటీ దాడుల‌పై.. 

"మొదట ప్ర‌ధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ వచ్చింది, అది నిషేధించబడింది. ఇప్పుడు బీబీసీపై ఐటీ దాడులు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గళం విప్పినా.. వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామని ఇలా హెచ్చ‌రిక‌లు బీజేపీ చేస్తోంద‌ని" జైరాం రమేష్ ఆరోపించారు.