వర్షాలు కురిపించని వాన దేవుడి మీద చర్యలు తీసుకోవాలంటూ ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా కలెక్టర్ కు సిఫార్సు చేశాడు. ఆ తరువాత జరిగిన తప్పు తెలుసుకుని నాలిక్కరుచుకున్నాడు.
లక్నో : ఓ వైపు దేశ వ్యాప్తంగా వర్షాలు, వరదలు ముంచెత్తుతుంటే.. మరోవైపు ఉత్తర ప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు వర్షాభావంతో అల్లాడుతున్నాయి. దీంతో సకాలంలో వానలు కురిపించని వాన దేవుడిపై, అతనికి ఆ మేరకు ఆదేశాలు ఇవ్వని ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎన్ వర్మ అనే ఓ రెవెన్యూ అధికారి తీర్మానించాడు. ఈ మేరకు ఏకంగా జిల్లా కలెక్టర్ కే సిఫార్సు చేశాడు. అసలేం జరిగిందంటే.. వర్షాభావానికి ఇంద్రుడు, వరుణుడే బాధ్యులు అని ఆరోపిస్తూ ఫిర్యాదుల స్వీకరణ దినం (సమాధాన్ దివస్) సందర్భంగా సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు వర్మకు ఒక లేఖ ఇచ్చాడు.
అది ఆయన చూశాడో, లేదో తెలియదు కానీ.. ఈ లేఖ మీద ‘బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని’ సిఫార్సు చేస్తూ ఆ లేఖను ఏకంగా కలెక్టర్ కు పంపించాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వర్మ నాలిక్కరుచుకున్నాడు, అంతేకాదు, తానసలు ఆ లేఖ పంపనేలేదని బుకాస్తున్నాడు. అయితే, సమాధాన్ దివస్ లో వందలాది ఫిర్యాదులు వస్తుంటాయి. వాటిల్లో ఈ లేఖ ఒకటి.. బహుశా చదవకుండానే ఫార్వర్డ్ చేసి చిక్కుల్లో పడ్డాడు.. అని అధికారులు అంటున్నారు. ఇంతకు ఇంద్ర, వరుణులపై కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలంటూ నెటిజన్లు హాస్యం పండిస్తున్నారు.
వానదేవుడి కరుణ కోసం.. బీజేపీ ఎమ్మెల్యేకు బురదతో స్నానం.. ఉత్తరప్రదేశ్ లో విచిత్రం...
ఇదిలా ఉండగా, జూన్ 14న ఇలాంటి విచిత్ర ఘటనే ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ లో జరిగింది. ఇక్కడ వేడి కాకపుట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ నివాసితులు ఎండ వేడికి అల్లాడిపోతున్నారు. వర్షాకాలం వచ్చినా వానలు కురవకపోవడంతో.. నీటికి కటకట, వేడిని తట్టుకోలేక, పంటలు ఎలా పండించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం వానదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. కప్పల పెళ్లి చేయడం అందరికీ తెలిసిందే. అయితే, ఇది ఇప్పటివరకు వినని మొక్కు. ఏంటంటే.. మంగళవారం రాత్రి, ఇంద్రుడిని ఆకర్షించడానికి వారి 'ప్రత్యేక ఆచారం'లో భాగంగా పిప్రదేయోరా మహిళలు బిజెపి ఎమ్మెల్యే జై మంగళ్ కనోజియా, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు కృష్ణ గోపాల్ జైస్వాల్‌లకు మట్టి స్నానం చేయించారు.
తూర్పు ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతంలోని ప్రజలు మనుషుల్ని బురదలో విసిరివేయడం లేదా స్నానం చేయించడం వల్ల వరుణ దేవుడైన ఇంద్రుడు సంతోషిస్తాడని నమ్ముతారు. అందుకోసం తమ ప్రాంత ప్రజాప్రతినిధులనే ఎన్నుకున్నారు. అలా వీరిద్దరినీ బురదతో ముంచిన తరువాత, మహిళలు ఇంద్రుడు సంతోషించి ఉంటాడని, పట్టణాన్ని వర్షాలతో ఆశీర్వదిస్తాడు అని చెప్పారు. ఎమ్మెల్యే జై మంగళ్ కనోజా మాట్లాడుతూ ఎండల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే పూజలో పాల్గొనేందుకు అంగీకరించామన్నారు “ఈ వాతావరణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, పంటలు ఎండిపోతున్నాయి. ఇది తరతరాలుగా వస్తున్న నమ్మకంపై ఆధారపడిన ఆచారం కాబట్టి.. మేము ఇందులో పాల్గొనడానికి తమ ప్రాంత ప్రజలను తృప్తి పరచాలని నిర్ణయించుకున్నాం”అని అతను చెప్పాడు.
