ఉత్తరప్రదేశ్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వరుణదేవుడి కరుణ కోసం తమ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జై మంగళ్ కనోజియాకు బురదతో స్నానం చేయించి మొక్కులు మొక్కుకున్నారు మహిళలు.
ఉత్తరప్రదేశ్ : దేశవ్యాప్తంగా వర్షాలు ముంచెత్తుతుంటే ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ లో మాత్రం వేడి కాకపుట్టిస్తోంది. రెయిన్ రెయిన్ గో అవే అంటూ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు.. వరదల బాధనుంచి తప్పించుకునేందుకు వరుణదేవుడిని ఇక తెరిపివ్వు అని కోరుకుంటుంటే.. అక్కడ మాత్రం మా మీద కరుణ చూపించయ్యా అంటూ వేడుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ నివాసితులు ఎండ వేడికి అల్లాడిపోతున్నారు. వర్షాకాలం వచ్చినా వానలు కురవకపోవడంతో.. నీటికి కటకట, వేడిని తట్టుకోలేక, పంటలు ఎలా పండించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం వానదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. కప్పల పెళ్లి చేయడం అందరికీ తెలిసిందే. అయితే, ఇది ఇప్పటివరకు వినని మొక్కు. ఏంటంటే.. మంగళవారం రాత్రి, ఇంద్రుడిని ఆకర్షించడానికి వారి 'ప్రత్యేక ఆచారం'లో భాగంగా పిప్రదేయోరా మహిళలు బిజెపి ఎమ్మెల్యే జై మంగళ్ కనోజియా, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు కృష్ణ గోపాల్ జైస్వాల్‌లకు మట్టి స్నానం చేయించారు.
ప్రియురాలు మోసం చేసిందని హత్య చేసి.. ప్రియుడు ఆత్మహత్య..
తూర్పు ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతంలోని ప్రజలు మనుషుల్ని బురదలో విసిరివేయడం లేదా స్నానం చేయించడం వల్ల వరుణ దేవుడైన ఇంద్రుడు సంతోషిస్తాడని నమ్ముతారు. అందుకోసం తమ ప్రాంత ప్రజాప్రతినిధులనే ఎన్నుకున్నారు. అలా వీరిద్దరినీ బురదతో ముంచిన తరువాత, మహిళలు ఇంద్రుడు సంతోషించి ఉంటాడని, పట్టణాన్ని వర్షాలతో ఆశీర్వదిస్తాడు అని చెప్పారు. ఎమ్మెల్యే జై మంగళ్ కనోజా మాట్లాడుతూ ఎండల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే పూజలో పాల్గొనేందుకు అంగీకరించామన్నారు “ఈ వాతావరణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, పంటలు ఎండిపోతున్నాయి. ఇది తరతరాలుగా వస్తున్న నమ్మకంపై ఆధారపడిన ఆచారం కాబట్టి.. మేము ఇందులో పాల్గొనడానికి తమ ప్రాంత ప్రజలను తృప్తి పరచాలని నిర్ణయించుకున్నాం”అని అతను చెప్పాడు.
