న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంలో జరుగుతున్న జాప్యానికి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నిందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్లక్ష్యం వల్లనే నిర్భయ కేసు నిందితులకు ఉరిశిక్ష అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆయన విమర్శించారు. 

ఢిల్లీలో 2012లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి, చిత్రహింసలు పెట్టి ఆమెను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22వ తేదీన ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. అయితే, నిందితుల్లో ఒకతను రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకోవడంతో దాన్ని అమలు చేయడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. 

2012 గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు దోషులను ఉరి తీయడంలో ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జాప్యం జరుగుతోందని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. న్యాయం జరగడంలో జాప్యానికి ఆప్ దే బాధ్యత అని ఆయన అన్నారు. గత రెండున్నరేళ్లలో మెర్సీ పిటిషన్ పెట్టుకోవాలని దోషులకు ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు నోటీసులు జారీ చేయలేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అడిగారు. 

Also Read: నిర్భయ కేసులో ముఖేష్ సింగ్‌కు షాక్: మెర్సీ పిటిషన్ తిరస్కరణ

నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్షను అమలు చేయడం ఈ నెల 22వ తేదీన సాధ్యం కాదని, నలుగురిలో ఒకతను మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నాడని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన డెత్ వారంట్ ను పక్కన పెట్టడానికి హైకోర్టు నిరాకరించింది. అందులో తప్పేమీ లేదని వ్యాఖ్యానించింది.

నిర్భయ కేసులో దోషులు వినయ్ శర్మ, ముకేష్ కుమార్, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలకు ఈ నెల 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేయనున్నారు. వాళ్లను ఉరి తీయడదానికి ట్రయల్ కోర్టు న్యాయమూర్తి డెత్ వారంట్ పై సంతకం చేశారు. కదులుతున్న బస్సులో 2012 డిసెంబర్ లో నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, చిత్రహింసలు పెట్టి ఆమెను హత్య చేశారు. 

Also Read: నిర్భయ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్: దోషులకు ఉరిశిక్ష మరింత ఆలస్యం

డెత్ వారంట్ ను సవాల్ చేస్తూ దోషి దాఖలు చేసి పిటిషన్ ను తిరస్కరిస్తూ దానిపై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. మెర్సీ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ నెల జనవరి 22వ తేదీన దోషులను ఉరి తీయడం సాధ్యం కాదని కోర్టు చెప్పింది.