చిరుత అనారోగ్యంగా ఉందని, బైక్ పై ఎక్కించుకొని హాస్పిటల్ కు తీసుకెళ్లిన యువకుడు.. నోరెళ్లబెట్టిన జనం
అనారోగ్యంతో ఉన్న ఓ చిరుతను కాపాడేందుకు ఓ యువకుడు తన ధైర్య సహసాలు ప్రదర్శించాడు. ఈ క్రూర జంతువును బైక్ పై వెటర్నరీ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. దీనిని చూసిన స్థానికులు షాక్ అయ్యారు.
సాధారణంగా చిరుతపులిని చూస్తే మనం ఏం చేస్తాం ? వెంటనే భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాం. ఎంత ముఖ్యమైన పనులున్నా.. వాటిని పక్కన పెట్టి ముందు ప్రాణాలను రక్షించుకుంటాం. కానీ ఓ యువకుడు అలా చేయలేదు. చిరుతను చూసి భయపడి పారిపోలేదు. అది అనారోగ్యంతో బాధపడుతుందని గుర్తించాడు. వెంటనే దానిని బైక్ పై ఎక్కించుకొని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. యువకుడి ధైర్యం చూసిన జనం నోరెళ్లబెట్టారు. ఈ వింత ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా అర్సికెరె తాలూకా బాగివాలు గ్రామానికి చెందిన 25 వేణుగోపాల్ అలియాస్ ముత్తు వ్యవసాయం చేస్తుంటాడు. ఎప్పటిలాగే పొలం పనుల కోసం శుక్రవారం తన వ్యవసాయ క్షేత్రం లోకి వెళ్లాడు. అయితే ఆ సమయంలో ఓ చిరుత అతడి కంట పడింది. అది నీరసంగా పొలం మూలన పడి ఉంది. కొంత సేపు ఆ క్రూర జంతువును అలాగే చూస్తు ఉండిపోయాడు.
అది అనారోగ్యంతో మూలుగుతూ ఉండటాన్ని గమనించాడు. దానిని రక్షించాలని భావించాడు. ఆ క్రూర జంతువు కదలడానికి కూడా వీల్లేనంత అలసటగా ఉందని ఆయన గ్రహించాడు. మెళ్లగా దాని వద్దకు చేరుకున్నాడు. ప్రేమతో దానిని నిమిరాడు. అది అతడిని ఏం చేయలేదు. దానిని హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించాలని అనుకున్నాడు. అనంతరం చిరుతను ఎత్తుకున్నాడు. బైక్ దగ్గరికి తీసుకెళ్లాడు. బైక్ నడుస్తున్నప్పుడు ఆ జంతువు కింద పడిపోకుండా ఉండటానికి దానిని ఓ తాడుతో కట్టేశాడు.
అనంతరం బైక్ స్టార్ట్ చేసి వెటర్నరీ హాస్పిటల్ కు గ్రామం నుంచి బయలుదేరాడు. ఈ వింత దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు షాక్ అయ్యారు. అనంతరం ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఆ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యంలో వేణుగోపాల్ బైక్ పై చిరుతను కట్టేసి తీసుకువస్తుండటాన్ని గమనించారు. అతడిని ఆపారు. దీంతో జరిగిన విషయాన్ని మొత్తం వేణుగోపాల్ అధికారులకు తెలియజేశాడు. అనంతరం అధికారులు తమ వాహనంలో ఆ చిరుతను ప్రభుత్వ పశువైద్యశాలకు తరలించారు.
అమానవీయం.. గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన..యూపీలో ఘటన, నిందితుల అరెస్టుఅక్కడ దానికి చికిత్స అందించారు. ఈ ఘటనపై హసన్ డీసీఎఫ్ ఆశిష్ రెడ్డి మాట్లాడుతూ.. చిరుత డీహైడ్రేట్ అయిందని, కదలడానికి కూడా శక్తి లేకుండా అలసిపోయిందని చెప్పారు. ఈ పులికి సుమారు తొమ్మిది నెలల వయస్సు ఉంటుందని అన్నారు. ఆహారం కోసం గ్రామంలోకి వచ్చి ఉంటుందని తెలిపారు. చిరుతపులి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని అన్నారు. అయితే యువకుడి చర్య వెనుక ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదని అన్నారు.