చత్తీస్ గఢ్ లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ చిన్నారి అగ్గిపెట్టెతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో మరణించాడు. 

చత్తీస్ గఢ్ : చిన్నపిల్లల్ని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. వాళ్ళు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్లు వారికి ప్రాణాపాయంగా మారుతుంటాయి. అలాంటి ఘటనే ఛత్తీస్ గఢ్ లోని కొరియాలో వెలుగు చూసింది. అగ్గిపెట్టెతో ఆడుకుంటున్న బాలుడు పక్కనే ఉన్న గడ్డికి నిప్పంటించడంతో అగ్నిప్రమాదం సంభవించి, బాలుడు మరణించాడు. గడ్డికి అంటుకున్న మంటలు ఒక్కసారిగా, పెద్ద ఎత్తున లేవడంతో ఆ మంటల్లో పడి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. హృదయాన్ని మెలిపెట్టే ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి ఛత్తీస్గఢ్లోని కొరియా ప్రాంతంలో జరిగింది.

మృతి చెందిన ఆ బాలుడు తల్లి దండ్రులతో కలిసి అక్కడ జరుగుతున్న తమ బంధువుల పెళ్లికి వచ్చాడు. ఈ క్రమంలో ఆ బాలుడికి అగ్గిపెట్టె దొరికింది. దానితో ఆడుకుంటూ అక్కడక్కడే తిరుగుతున్న బాలుడు.. పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్ళాడు. అక్కడ గడ్డిని పశువుల మేత కోసం నిలువ చేసి ఉంచారు. అగ్గిపుల్లలు ముట్టిస్తూ ఆడుకుంటున్న బాలుడు.. తెలియకుండా చేసిన పొరపాటుతో అగ్గిపుల్ల గడ్డివాము మీద పడి, అంటుకుంది. దీంతో ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. అనుకోని ఈ పరిణామానికి చిన్నారి గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు. ఆ ఏడుపు విన్న తల్లి పరిగెత్తుకుంటూ వెళ్లి కాపాడడానికి ప్రయత్నించింది. కానీ, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న మంటల వల్ల అది సాధ్యం కాలేదు. చిన్నారి మృతి చెందాడు. 

నిక్కీ యాదవ్ హత్య కేసు : ప్రియురాలిని చంపి, పక్కసీటులో శవంతో 40 కి.మీ.లు ప్రయాణించిన సాహిల్...

ఇదిలా ఉండగా, ఇలాంటి విషాద ఘటనే ఈ జనవరిలో ఆంద్రప్రదేశ్ లోని కర్నూలులో చోటు చేసుకుంది. లేక లేక పుట్టిన బిడ్డ అనుకోకుండా.. హఠాత్తుగా మరణించడం ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. హోమియో మందుల డబ్బాను ఆడుకునే వస్తువు అనుకుని నోట్లో పెట్టుకున్న ఆ చిన్నారి.. డబ్బా గొంతులో ఇరుక్కోవడంతో మృతి చెందింది. పెళ్లైన 20 యేళ్లకు పుట్టిన బిడ్డ సంవత్సరం కూడా తిరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ కన్నతల్లి కన్నీటిని ఆపడం ఎవ్వరి తరమూ కావడం లేదు. 

ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలం చింతమానుపల్లెలో చోటు చేసుకుంది. ఈ విషాదం మీద ఆ కుటుంబ సభ్యులు ఈ మేరకు వివరాలు తెలియజేశారు. నల్లన్న, సువర్ణమ్మ దంపతులు. కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరు చింమతమానుపల్లె గ్రామంలోని దళితవాడలో ఉంటున్నారు. వీరికి వివాహం అయి రెండు దశాబ్దాలు అవుతున్నా పిల్లలు లేరు. 20 యేళ్లకు ఇటీవలే చిన్నారి ప్రదీప్ జన్మించాడు. లేకలేకపుట్టిన బిడ్డ కావడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. 

అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి. అతని ముద్దు మాటలతో ఇల్లు సందడిగా ఉంటోంది. కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ సరదాగా గడుపుతున్నారు. ఇంతలో పదినెలల చిన్నారి పాకుతూ వెళ్లి పక్కనే ఉన్న హోమియో మందుల డబ్బాను నోట్లో పెట్టుకున్నాడు. అది చిన్నాగా ఉండి అతని గొంతులోకి జారింది. దీంతో బైటికి రాక.. గొంతులోనే ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడలేదు. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసి ఆ తల్లిదండ్రుల శోకంతో ఆ ప్రాంతం విషాదఛాయలు అలుముకున్నాయి.