Omicron: వ్యాక్సినేషన్ చాలదు! ప్రతి 10 ఒమిక్రాన్ కేసుల్లో 9 మంది పేషెంట్లకు రెండు డోసులు పూర్తి: కేంద్రం
ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. మన దేశంలోని 183 ఒమిక్రాన్ పేషెంట్లపై నిర్వహించిన ఓ అధ్యయనాన్ని వెల్లడించింది. ఒమిక్రాన్ కట్టడికి కేవలం వ్యాక్సినేషన్ చాలదని, మాస్కు ధరించడం, నిఘా, వైరస్ చైన్‌ను బ్రేక్ చేయాలని వివరించింది. ఎందుకంటే ఇక్కడ ప్రతి పది మంది ఒమిక్రాన్ పేషెంట్లలో తొమ్మిది మంది రెండు డోసుల టీకా తీసుకుని ఉన్నారని పేర్కొంది.
న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) దక్షిణాఫ్రికాలో రిపోర్ట్ అయిన తొలినాళ్లలో బయటకు వచ్చిన సమాచారం అప్పుడు కలవర పెట్టిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తుందని అక్కడి పరిశోధనలు తెలిపాయి. అంతేకాదు, ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుత టీకా (Vaccine) సామర్థ్యాలను అధిగమించే అవకాశం ఉన్నదని వివరించాయి. ప్రస్తుత టీకాలు ఒమిక్రాన్‌ను పూర్తిస్థాయిలో నిలువరించలేకపోవచ్చునని తెలిపాయి. తాజాగా.. ఇదే తరహాలో కేంద్రం వ్యాఖ్యలు చేసింది. మనదేశంలో ఒమిక్రాన్ బారిన పడ్డ 183 కేసులపై చేసిన విశ్లేషణలను కేంద్రం వెల్లడించింది. దీని ప్రకారం, ఒమిక్రాన్ బారిన పడ్డ ప్రతి పది మందిలో తొమ్మిది మంది రెండు డోసుల టీకాలు వేసుకున్నవారే. ఈ పాయింట్ చెబుతూ.. ఒమిక్రాన్‌ను అడ్డుకోవాలంటే కేవలం టీకా పంపిణీ(Vaccination) చాలదని, ఇతర జాగ్రత్తలూ తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. మాస్కులు ధరించడం, నిఘా, వైరస్ చైన్ బ్రేక్ చేయడం కీలకమని వివరించింది.
ఈ సందర్భంలోనే మరో కీలక విషయాన్ని కేంద్రం వెల్లడించింది. ఈ 183 ఒమిక్రాన్ కేసుల్లో 27 శాతం పేషెంట్లకు అసలు విదేశాలు వెళ్లిన చరిత్రే లేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. అంటే, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కేవలం విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారిలోనే కాదు.. ఇక్కడ ఉన్నవారిలోనూ వెలుగు చూసినట్టు పేర్కొంది. ఒమిక్రాన్ బారిన పడ్డ 183 మంది పేషెంట్ల వ్యాక్సినేషన్ స్టేటస్‌ను కేంద్రం తెలిపింది. ఇందులో 73 మంది వ్యాక్సినేషన్ స్టేటస్ తెలియరాలేదని, కాగా, 16 మంది టీకా తీసుకోవడానికి అనర్హులని పేర్కొంది. అయితే, మిగిలిన వారిలో 87 మంది పేషెంట్లు (91శాతం) రెండు డోసుల టీకా తీసుకున్నారు. కాగా, కేవలం ఏడుగురు మాత్రమే టీకా తీసుకోలేరు. మరో ఇద్దరు ఒక్క డోసు టీకా మాత్రమే తీసుకున్నారని ఆ అధ్యయనం వెల్లడించింది.
Also Read: దేశంలో 358కి చేరుకున్న ఒమిక్రాన్ కేసులు- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
కుటుంబంలో ఒకరి నుంచి ఇతరులకు వ్యాపించే సామర్థ్యం డెల్టా వేరియంట్ కంటే కూడా ఒమిక్రాన్ వేరియంట్‌కు ఎక్కువగా ఉన్నదని భారత కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ అన్నారు. మాస్కు ధరించనందున బయట ఒక్కరికి ఒమిక్రాన్ సోకితే.. అది సులువుగా ఇంటిలోని అందరికీ సోకుతుందని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్‌తో ఈ ముప్పు ఎక్కువ అని వివరించారు. ఇదే సందర్భంలో రానున్న పండుగలు, న్యూ ఇయర్ వేడుకలనూ ప్రస్తావించాలనుకుంటున్నట్టు చెప్పారు. కొత్త వేరియంట్ కారణంగా ఈ వేడుకల సమయంలో బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన అవసరం ఉన్నదని, వీలైనంత చిన్నగా చేసుకోవాలనీ సూచించారు.
Also Read: తెలంగాణలో కొత్తగా 162 కరోనా కేసులు.. సగం హైదరాబాద్‌లోనే.. ఒమిక్రాన్ రిజల్ట్స్ పెండింగ్
కాగా, ఇదే అధ్యయనంలో మరో కీలక విషయం తెలిసింది. మన దేశంలో ఒమిక్రాన్ కేసుల్లో 70 శాతం మంది పేషెంట్లలో ఎలాంటి క్లినికల్ సింప్టమ్స్ లేవని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ చెప్పారు. ఇప్పటికీ మన దేశంలో తీవ్ర ప్రభావం డెల్టానే కలిగి ఉన్నదని, కాబట్టి, కట్టడి కోసం ప్రస్తుతం అమల చేస్తున్న వ్యూహాన్నే కొనసాగించాలని పేర్కొన్నారు. ఒమిక్రాన్‌తో తీవ్ర లక్షణాలు ఏర్పడటం లేవని, మన దేశంలోనైతే మూడో వంత కేసుల్లో మాత్రమే స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని వివరించారు. కాబట్టి, ఒమిక్రాన్ పేషెంట్లకూ అదే తరహా ట్రీట్‌మెంట్ కొనసాగుతుందని అన్నారు.