చండీగడ్: పంజాబ్ లో కల్తీ మద్యాన్ని సేవించి మరణించిన వారి సంఖ్య 86కు చేరుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని తరన్ తరన్, అమృత్ సర్, బటాలాలో ఈ మరణాల సంఖ్య ఎక్కువగా వుంది. ఒక్క తరన్ తరన్ లోనే 63మంది ఈ నకిలీ మద్యానికి బలయ్యారంటేనే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థమవుతుంది.  

ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హెచ్చరించరిక నేపథ్యంలో ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా ఏడుగురు ఎక్సైజ్, ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.

read more   కురిచేడు బాధితులకు రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలి: కళా వెంకట్రావు
 
నకిలీ మద్యం వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం అమరీందర్ జలంధర్‌ డివిజన్‌ కమీషనర్‌ నేతృత్వంలో మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంతో సంబంధాలున్న వారిని వదిలిపెట్టకూడదంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇక నకిలీ మద్యం సేవించి మృతిచెందిన వారి కుటుంబాలకు రెండు లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. 

రాష్ట్రంలో నకిలీ మద్యం మరణాలు ఎక్కువవుతుండటంతో పోలీసులు అక్రమ మద్యం తయారీ స్థావరాలపై దాడులు  చేపట్టారు. ఇప్పటివరకు 100కు పైగా స్థావరాలపై దాడి చేసి ఎలాంటి అనుమతులు లేకుండా మద్యాన్ని తయారు చేస్తున్నవారిని అరెస్ట్ చేశారు. అలాగే మద్యం నిల్వలను ధ్వంసం చేశారు.