మనీష్ సిసోడియాకు 7 గంటల బెయిల్.. భార్యను కలిసేందుకు ఇంటికి చేరుకున్న ఆప్ నేత
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా తన భార్యను కలిసేందుకు శనివారం ఇంటికి చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును ఆయన కోరారు. మానవతా దృక్పథంతో కోర్టు స్పందించి, ఆయనకు 7 గంటల బెయిల్ మంజూరు చేసింది.

ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు ఏడు గంటల బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తన భార్యను కలిసేందుకు శనివారం దేశ రాజధానిలోని తన నివాసానికి చేరుకున్నారు. భార్య అనారోగ్యం దృష్యా ఆప్ నేతకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ సమయంలో సిసోడియా మీడియాతో మాట్లాడకూడదని, కుటుంబ సభ్యులు కాకుండా, ఇతర వ్యక్తులను కలవకూడదని జస్టిస్ దినేష్ కుమార్ శర్మ సూచించారు. అంతే కాకుండా ఆయనకు ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంచకూడదని న్యాయమూర్తి చెప్పారు.
సిసోడియా మధ్యంతర బెయిల్ పై స్టేటస్ రిపోర్టును మరుసటి రోజు సాయంత్రంలోగా అందజేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను ఆదేశించింది. కాగా.. తన భార్య ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ కోసం సిసోడియా దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సిసోడియా దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా రిజర్వ్ లో ఉంది.
మధ్యంతర బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఈడీ వాదించింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. సిసోడియా తన భార్యను పోలీసు ఎస్కార్ట్ తో కలిసేందుకు అనుమతి ఇవ్వవచ్చని సూచించారు. సిసోడియా గతంలో అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించారని, కానీ ఆయన భార్యను కలిసేందుకు సమయం కేటాయించలేదని ఏఎస్జీ హైలైట్ చేసినట్లు బార్ అండ్ బెంచ్ నివేదించింది.
కాగా.. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు 7 గంటల పాటు ఆయన ఉపశమనం ఇచ్చింది. సిసోడియా.. తన భార్య అనారోగ్యాన్ని ప్రస్తావిస్తూ కోర్టులో దాఖలు చేసిన దరఖాస్తులో.. ఆమెతో ఉండేందుకు కొంత సమయం ఇవ్వాలని, తన భార్య చికిత్స కాకుండా ఇతర సంరక్షణకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి ఉందని కోరారు. మానవతా దృక్పథంతో ఆయన దరఖాస్తును కోర్టు స్వీకరించింది. జూన్ 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సిసోడియా తన భార్యతో ఉండవచ్చని, ఆమె సంరక్షణకు సంబంధించిన ఇతర ఏర్పాట్లు చేసుకోవచ్చిన పేర్కొంది. కాగా..లిక్కర్ పాలసీ కేసులో ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేయగా, మార్చి 9న ఈడీ అరెస్టు చేసింది.