Asianet News TeluguAsianet News Telugu

ఈశాన్య రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం తగ్గింది : అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, తిరుగుబాటు ఘటనలు 65 శాతం తగ్గాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తెలిపారు . ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కఠినమైన చట్టాలను రూపొందించిందని ఆయన చెప్పారు. 
 

65% fall in incidents of terrorism, insurgency in Northeast: Amit Shah ksp
Author
First Published Oct 21, 2023, 3:57 PM IST

ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, తిరుగుబాటు ఘటనలు 65 శాతం తగ్గాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తెలిపారు. దేశంలోని మూడు హాట్‌స్పాట్‌లు ఎల్‌డబ్ల్యూఈ (లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలు), ఈశాన్య, జమ్మూ అండ్ కాశ్మీర్ శాంతియుతంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా జాతీయ పోలీస్ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కఠినమైన చట్టాలను రూపొందించిందని ఆయన చెప్పారు. 

పోలీస్ బలగాల ఆధునీకీకరణ కోసం పోలీస్ టెక్నాలజీ మిషన్‌ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ ఉగ్రవాద నిరోధక దళాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేసిందని అమిత్ షా స్పష్టం చేశారు. నేర న్యాయ వ్యవస్థను సమగ్రంగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం మూడు బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిందని షా చెప్పారు. మూడు చట్టాలు 150 ఏళ్ల నాటి చట్టాలను భర్తీ చేస్తాయని.. ప్రతి పౌరునికి అన్ని రాజ్యాంగ హక్కులకు హమీ ఇస్తాయని హోంమంత్రి పేర్కొన్నారు . 

ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం, తిరుగుబాటు ఘటనలు 65 శాతం తగ్గాయని.. ఇందుకు పోలీసు సిబ్బంది కృషిని ఆయన అభినందించారు. ఉగ్రవాదులతో పోరాడినా, నేరాలను అరికట్టడంలో భారీ సమూహంలో శాంతి భద్రతల పరిరక్షణలో లేదా విపత్తుల సమయంలో రక్షణ కవచంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించడంలోనూ పోలీస్ సిబ్బంది తమను తాము నిరూపించుకున్నారని అమిత్ షా స్పష్టం చేశారు. గతంలో ఎన్‌డీఆర్ఎఫ్ ద్వారా వివిధ పోలీస్ బలగాలకు చెందిన సిబ్బంది విపత్తు నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారని హోంమంత్రి అన్నారు. 

ఎంత పెద్ద విపత్తు వచ్చినా.. ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పుడు.. ఎన్‌డీఆర్ఎఫ్ వచ్చిందన్న నమ్మకం ప్రజలకు కలుగుతుందన్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వాటిని మెరుగుపరిచేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని షా తెలిపారు. మోడీ ప్రభుత్వం ఉద్యోగులందరి సంక్షేమానికి అంకితమైందని.. వారి భద్రతపై శ్రద్ధ వహిస్తోందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశానికి సేవ చేస్తూ ప్రాణాలర్పించిన 36,250 మంది పోలీసులకు నివాళులర్పించారు. 

అక్టోబర్ 21, 1959న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దళాలు చేసిన మెరుపుదాడిలో 10 మంది పోలీసులు అమరులయ్యారు. నాటి నుంచి ప్రతి యేటా అక్టోబర్ 21న విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బందిని గౌరవించుకుంటున్నారు. పోలీస్ సిబ్బంది చేసిన త్యాగాలు, జాతీయ భద్రత, సమగ్రతను పరిరక్షించడంలో వారి ప్రధాన పాత్రకు గుర్తింపుగా ప్రధాని నరేంద్ర మోడీ 2018లో పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా చాణక్యపురిలో జాతీయ పోలీస్ స్మారకాన్ని జాతికి అంకితం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios