గోవాలోని లైరాయి దేవి ఆలయంలోదారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. 15 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గోవాలోని శ్రీగాంలో ఉన్న లైరాయి దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. 15 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. మీడియా కథనాల ప్రకారం, ఆలయంలో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. భక్తులు భయంతో పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాని ప్రకారం, అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ప్రజలు ఒకరిపై ఒకరు పడి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేశారు.
సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. ఉత్తర గోవా పోలీస్ సూపరింటెండెంట్ అక్షత్ కౌశల్ ఈ సమాచారాన్ని వెల్లడించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ విషయమై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే మాట్లాడుతూ.. ‘మేము 108 సేవల ద్వారా ఐదు అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి పంపించాము. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు మరో మూడు అంబులెన్సులను సిద్ధంగా ఉంచాము. అని చెప్పుకొచ్చారు.
తొక్కిసలాటకు గల కారణం ఇంకా తెలియరాలేదు. జాతర కోసం దాదాపు 1,000 మంది పోలీసులను నియమించారు. జనసమూహ కదలికలను గమనించేందుకు డ్రోన్‌లను కూడా ఉపయోగించారు. కాగా శుక్రవారం ముఖ్యమంత్రి సావంత్, ఆయన సతీమణి సులక్షణ, రాజ్యసభ ఎంపీ సదానంద్ షెట్ తనవాడే, ఎమ్మెల్యేలు ప్రేమేంద్ర షెట్, కార్లోస్ ఫెరీరా ఆలయాన్ని దర్శించుకున్నారు.


