2024 లోక్‌సభ ఎన్నికలపై కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా 50 మంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, మంత్రులు పార్టీ పెద్దలను కలుస్తున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మంగళవారం తెలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికలపై కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా 50 మంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఆగస్టు 2న న్యూఢిల్లీలో పార్టీ పెద్దలను కలుస్తున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మంగళవారం తెలిపారు. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా తదితరులు పాల్గొనే అవకాశం వుంది.
ఢిల్లీకి బయల్దేరే ముందు .. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, ప్రాజెక్ట్‌లపై కొందరు కేంద్ర మంత్రులను కూడా కలుస్తానని శివకుమార్ పేర్కొన్నారు. దాదాపు 30 మంది శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, పార్టీ నాయకత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు, నేతలతో పార్టీ సమావేశం జరుగుతుందని శివకుమార్ తెలిపారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రయోజనాలకు అనుగుణంగా ఏం చేయాలనే దానిపై చర్చించి వ్యూహాన్ని రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు ఎన్నికల బాధ్యత తీసుకుని ఇప్పటి నుంచే పర్యటనలు ప్రారంభించాలనేది మా ఉద్దేశ్యమన్నారు. ఈ సమావేశానికి మంత్రులు, కొందరు శాసనసభ్యులనే కాకుండా దాదాపు 10 మంది సీనియర్ నేతలను కూడా ఢిల్లీకి పిలిచారు. మొత్తం 50 మంది మూడు డివిజన్లలో పార్టీ నాయకత్వాన్ని కలుస్తారు.
ఇదిలావుండగా.. గత వారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ కొందరు శాసనసభ్యులు కొంతమంది మంత్రుల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మెరుగైన అనుసంధానం కోసం సమన్వయ కమిటీ ఆవశ్యకతకు సంబంధించిన చర్చల గురించి కూడా పెద్దలకు నివేదికలు అందినట్లుగా కథనాలు వచ్చాయి. అయితే సీఎం సిద్ధారామయ్య, డీకే శివకుమార్ మాత్రం మంత్రులు, అధికార పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని తేల్చిచెప్పారు.
