ఉత్తరాఖండ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఐదేళ్ల చిన్నారిపై తల్లిదండ్రుల ఎదుటే దాడి చేసిన ఓ చిరుతపులి నోటకరుచుకుని అడవిలో పరారయ్యింది. ఇలా ఇటీవల కాలంలో కూడా ఆ ప్రాంతంలో చిరుతల దాడికి ఇద్దరు చిన్నారులు బలయ్యారు. తాజా ఘటనతో స్థానిక ప్రజలు పిల్లలను బైటికి పంపడమానికే కాదు తాము కూడా ఇంటిబైటికి రావాలంటే భయపడుతున్నారు.
 
ఈ దుర్ఘటన కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పితోర్ ఘడ్ జిల్లాలోని పోఖ్రీ గ్రామానికి చెందిన ఓ కుటుంబం బందువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో డిల్లీకి వెళ్లారు. తిరిగి అర్థరాత్రి సమయంలో కారులో ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో ఓ ఐదేళ్ల చిన్నారి తల్లిదండ్రుల వద్ద నుండి ఇంట్లోకి పరుగెడుతుండగా దారుణం చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలోనే పొదల్లో మాటువేసిన ఓ చిరుత అమాంతం బాలుడిపై దాడి చేసి తల్లిదండ్రులు చూస్తుండగానే అడవిలోకి లాక్కెళ్లింది.

హటాత్తుగా జరిగిన ఈ పరిణామంలో తల్లిదండ్రులు తమ పిల్లాడిని కాపాడుకోలేక పోయారు. అనంతరం వారు గ్రామస్తులు, బంధువులకు జరిగిన విషయం తెలిపి వారి సాయంతో అడవిలో గాలింపు చేపట్టారు. అయినా బాలుడి ఆచూకీ లభించలేదు. 

దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులతో పాటు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు కూడా చిన్నారి జాడ కోసం గాలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కువయిందని, వాటి నుండి తమ గ్రామాలకు రక్షణ కల్పించాలని పితోర్ ఘడ్ జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇప్పటివరకు చిరుతలో దాడిలో ముగ్గురు చిన్నారులు బలైనట్లు జిల్లావాసులు ఆవేదనతో తెలియజేశారు.