దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మహమ్మారి జైళ్లలోకి పాగా వేస్తోంది. తాజాగా ముంబైలోని బైకుల్లా జైలులో సుమారు 40 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా కూడా వున్నారు.

వీరందర్నీ క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ 40 మందిలో చాలామందికి కరోనా లక్షణాలు కనిపించడంలేదని.. ముందు జాగ్రత్తగా వీరిని బైకుల్లా జైలుకు చెందిన పతంకర్ పాఠశాలలో ఐసొలేషన్‌లో ఉంచామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ముందు జాగ్రత్త చర్యగా మిగతా ఖైదీలు, జైలు సిబ్బంది మొత్తానికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు (ఆర్ఏటీ) చేయించారు. 2015 ఆగస్టులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా... అప్పటి నుంచి బైకుల్లా జైల్లోనే ఉన్నారు. 

Also Read:ఇండియాలో కరోనా కల్లోలం: ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు, మరణాలు

2012 ఏప్రిల్ 24న మొదటి భర్త సంజీవ్ ఖన్నా, మాజీ డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్‌తో కలిసి షీనా బోరాను కారులో గొంతునులిమి చంపేసింది. ముగ్గురు కలిసి రాయగఢ్ అటవీ ప్రాంతంలో మృత దేహాన్ని పూడ్చి‌పెట్టారు.
 
2015లో షీనా బోరా హత్య వెలుగుచూడంతో ఇంద్రాణి ముఖర్జియా జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. సంచలనం రేపిన ఈ హత్య కేసులో 2015 ఆగస్ట్‌లో ముంబై పోలీసులు ఆమెతో పాటు మాజీ భర్త, కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ మూడు నెలల తర్వాత రెండో భర్త పీటర్ ముఖర్జీయాను అరెస్ట్ చేసింది. ఈ నలుగురు నాటి నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నారు.