ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. వ్యర్థపదార్థాలను ఉంచే దుకాణంలో ఈ పేలుళ్లు సంభవించాయి. 

సోమవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుళ్ల దాటికి దుకాణంలో ఉన్న ఇద్దరితోపాటు.. దుకాణం ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆర్మీ ఎక్స్ ప్లోజివ్ యూనిట్ తోపాటు, యాంటీ టెర్రర్ టీం కూడా అలర్ట్ అయ్యింది. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా లేదా.. ఉగ్రవాద చర్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.