ఓ నగల షాపులో భారీ చోరీకి పాల్పడిన దొంగ పోలీసులకు దొరకకూడదనే ఉద్దేశ్యంతో అతి తెలివిగా ఆలోచించాడు. ఎక్కడ ఈ సొత్తు దాచేసినా ఎవరో ఒకరికి అనుమానం వచ్చి తన గుట్టు పోలీసులకు చెబుతారని ఆ దొంగకి తోచింది. అంతే ప్రపంచంలో అన్నింటి కంటే తన పొట్టే సేఫ్ అని భావించి.. కొట్టుకొచ్చిన ఉంగరాల్ని మింగేశాడు. తీరా విపరీతమైన కడుపు నొప్పి రావడంతో వైద్యులు అతని పొట్టకోసి ఉంగరాలను బయటకు తీశారు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా సుళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. మార్చి చివర్లో సుళ్య పాతబస్టాండు వద్ద గల ఓ ప్రముఖ నగల షాపులో భారీ చోరీ జరిగింది. రూ.7.50 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారపు ఉంగరాలు, రూ.50 వేలు నగదను దొంగలు దోచుకెళ్లారు.

Also Read:ప్రాణం తీసిన ఫోన్.. దొంగను పట్టుకోబోయి, రైలుకింద పడి...

దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ క్రమంలో ఐదురోజుల కిందట తంగచ్చయన్‌ మ్యాథ్యూ, శిబు అనే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వీరిద్దరిలో పోలీసులకు దొరక్కూడదనే ఉద్దేశంతో శిబు తన వద్ద గల 35 గ్రాముల ఉంగరాలను మింగేశాడు. అయితే అతనికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో పోలీసులు ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఎక్స్‌రే తీయగా కడుపులో ఉంగరాలు కనిపించాయి. దీంతో వైద్యులు అతని పొట్ట కోసి 25 చిన్న చిన్న ఉంగరాలను తీశారు. దొంగ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.