ప్రస్తుతం చైనా తదితర దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాలు స్పెషల్ క్యాంపులు పెట్టి మరి కరోనా వైరస్ వున్న వాళ్లకు చికిత్స అందిస్తున్నాయి. భారతదేశంలోనూ ఇప్పటి వరకు మూడు కరోనా కేసులు నమోదయ్యాయి.

చైనా నుంచి వచ్చిన వ్యక్తులకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించి, ఒకవేళ వున్నట్లు తేలితే వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Also Read:భారత్ లో మూడో కరోనా వైరస్ కేసు: ఇది కూడా కేరళలోనే....

ఈ క్రమంలో వుహాన్ నుంచి భారత్‌కు వచ్చిన ఇద్దరు వ్యక్తులు మధ్యప్రదేశ్‌లోని ఛత్రపూర్ జిల్లా ఆస్పత్రి నుంచి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. 20 ఏళ్ల వైద్య విద్యార్ధి వుహాన్ యూనివర్సిటీ నుంచి ఛత్రపూర్ జిల్లాలోని నౌగాంగ్ ప్రాంతానికి వచ్చాడు. తీవ్రమైన దగ్గు, జలుబు ఉండటంతో అతనిని జిల్లా ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచారు.

అతని నుంచి నమూనాలను సేకరించిన అనంతరం సదరు వైద్య విద్యార్ధి ఆస్పత్రి నుంచి కనిపించడం లేదని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. అదే విధంగా చైనా నుంచి జబల్‌పూర్ వచ్చిన మరో వ్యక్తిలో కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాయి.

అతని ఆచూకీ కూడా కనిపించడం లేదని అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు చేరడంతో.. వారిని వెంటనే కనుగొని ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సిందిగా అధికారులను ఆదేశించింది.

Also Read:భారత్ లో రెండో కరోనా వైరస్ కేసు: భారత్ సంచలన ఆదేశాలు

కాగా చైనాలోని వుహాన్ నుంచి భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా సుమారు 647 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. వీరిని హర్యానాలోని మానేసర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంప్‌లో ఉంచి పర్యవేక్షిస్తోంది.