గుండెపోటుతో 14యేళ్ల బాలుడు మృతి చెందిన ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది. క్రికెట్ ఆడుతుండగా ఛాతినొప్పితో కుప్పకూలి మరణించాడు.
మహారాష్ట్ర : గుండెపోటుకు మరో చిట్టి గుండె బలయింది. మహారాష్ట్రలోని పూణేలో ఓ 14 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. దేశవ్యాప్తంగా గత కొద్ది కాలంగా గుండెపోటు మరణాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఉన్నపాటిగా కుప్పకూలిపోతూ మరణిస్తున్నారు. వయసు తేడా లేకుండా చిన్నారుల నుంచి యువకుల వరకు ఇలా మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్రలోని ఈ చిన్నారి కూడా తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా అతడు ఛాతిలో నొప్పి వచ్చిందని మెలికలు తిరిగిపోతుండడంతో.. వెంటనే స్నేహితులు ఆ బాలుడు తండ్రికి తెలియజేశారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యులు పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు.
అక్కడికి వెళ్లిన వెంటనే బాలుడికి చికిత్స ప్రారంభించారు వైద్యులు. కాసేపటికి బాలుడు చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. బాలుడు మరణానికి గుండెపోటే కారణమన్న వైద్యులు.. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం మీద ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..
కర్ణాటకలోనే కాదు.. తెలంగాణలోనూ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తాం : అమిత్ షా
గురువారం సాయంత్రం మహారాష్ట్రలోనే పూనే జిల్లా వసూరి ప్రాంతంలో 14 ఏళ్ల వేదాంత్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆడుతున్న సమయంలో కొద్ది సమయానికే బాలుడికి ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. నొప్పితో విలవిల్లాడుతూ కింద పడిపోయాడు. ఇది చూసిన పిల్లలు వెంటనే వేదాంత్ తండ్రికి విషయాన్ని తెలియజేశారు.
వెంటనే తండ్రి అతడిని వనూరీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ వారు ప్రథమ చికిత్స చేసి పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి ఫాతిమా నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాలుడిని తరలించారు. అప్పటికే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే అడ్మిట్ చేసుకున్న వైద్యులు చికిత్స ప్రారంభించారు. కాసేపటికి వేదాంత్ మృతి చెందాడు. గుండె ఆగిపోయి పరిస్థితి విషమించడంతోనే వేదాంత మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. వేదాంత్ మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
